- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్‌రెడ్డి నిర్ణయాలపై ఉత్కంఠ.. బీఆర్ఎస్ నేతల్లో మొదలైన గుబులు!
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రులుగా ప్రమాణం చేసిన 11 మందికి శాఖల కేటాయింపు ప్రాసెస్ పూర్తయింది. హోం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరే ఉండిపోయాయి. గత ప్రభుత్వంలో అవినీతి, అవకతవకలు జరిగాయని ఇప్పటివరకూ కాంగ్రెస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ రెండు శాఖలపై సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే చర్చలు మొదలయ్యాయి. విద్యుత్, రవాణా శాఖలతో రెండు సమీక్షా సమావేశాలను పూర్తిచేసిన సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా హోం, మున్సిపల్ శాఖలను కూడా తన దగ్గరే ఉంచుకోవడంతో ‘రానున్న రోజుల్లో వీటి లోతుల్లోకి వెళ్తే..’ అనే గుబులు కొద్ది మంది బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది. గత ప్రభుత్వంలో అక్రమాలు, అవినీతి, అవకతవకలు జరిగాయనే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు జరిపించేలా నిర్ణయం తీసుకుం టే అవి ఎవరి మెడకు చుట్టుకుంటాయనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ శాఖల్ని సీఎం రేవంత్ తన దగ్గరే ఉంచుకుంటారా?.. లేక మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇతరులకు కేటాయిస్తారా?.. అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
సిట్టింగ్ జడ్జీతో విచారణ?
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తు జరిపించాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. సంబంధిత శాఖ మంత్రి హరీశ్‌రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. దీనిపై ఏసీబీ విభాగం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్.. దీని విషయం లో నిర్ణయం తీసుకుని దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొన్నది. గత ప్రభుత్వ వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు జరిపిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేయడంతో ఇప్పుడు సీఎం హోదాలో ఆయన అడుగులు ఎటువైపు పడతాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సిటీ చుట్టూ సుమారు పది వేల ఎకరాల భూములు కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసిందని పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పురపాలక శాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరే ఉండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ మొదలైంది.
ఓఆర్ఆర్ లీజు వ్యవహారంలో..
ఔటర్ రింగు రోడ్డును 30 ఏండ్లకు మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు కంపెనీకి అతి తక్కువ ధరకు లీజుకు ఇవ్వడం గతంలోనే వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని రేవంత్‌రెడ్డి అప్పట్లోనే ఆరోపించారు. అవగాహనా ఒప్పంద వివరాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో సమాచార హక్కు చట్టం దరఖాస్తు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉన్నది. ఈ వ్యవహారం మొత్తం పురపాలక శాఖ పరిధిలోనిది కావడంతో ఇప్పుడు ఆ శాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరే ఉండడంతో రానున్న రోజుల్లో ఎలాంటి కదలిక ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.
ఓఆర్ఆర్ లీజు అంశాన్ని రేవంత్‌రెడ్డి అప్పట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో యుద్ధమే చేశారు. చివరకు హెచ్ఎండీఏ తరఫున లీగల్ నోటీసు కూడా జారీ అయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఈ అంశంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో రివ్యూ చేస్తారా?.. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే నిర్ధారణకు వస్తే దానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటారా?.. సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశిస్తారా?.. ఇవీ ఇప్పుడు వివిధ స్థాయిల్లో జరుగుతున్న చర్చలు.