కేసీఆర్‌ను వాళ్లు నమ్మడం లేదా..? కొత్త చర్చకు తెరలేపిన కర్నాటక CM ప్రమాణాస్వీకారోత్సవ కార్యక్రమం

by Satheesh |   ( Updated:2023-05-21 04:29:43.0  )
కేసీఆర్‌ను వాళ్లు నమ్మడం లేదా..? కొత్త చర్చకు తెరలేపిన కర్నాటక CM ప్రమాణాస్వీకారోత్సవ కార్యక్రమం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌ను ఏఐసీసీ నేతలు నమ్మడం లేదా? నిలకడ లేని లీడర్‌గా భావిస్తున్నదా? ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే అనుమానం వ్యక్తమవుతున్నదా? అందుకే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి ఆయనను ఆహ్వానించలేదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నది. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవం శనివారం నిర్వహించగా.. అందుకు విపక్ష పార్టీల సీఎంలు, లీడర్లను ఏఐసీసీ ఇన్వైట్ చేసింది. కానీ బీజేపీపై యుద్ధం చేస్తున్న కేసీఆర్‌ను ఆహ్వానించకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది.

అవకాశవాది అనే ముద్ర?

తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత టెన్ జనపథ్‌లో జరిగిన రాజకీయ పరిణామాల నుంచి కేసీఆర్‌ను ఏఐసీసీ విశ్వసించడం లేదని ఆ పార్టీ లీడర్లు చెబుతుంటారు. పార్టీని విలీనం చేస్తానని చెప్పి కండీషన్లు పెట్టడంపై సోనియా ఇప్పటికీ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత కొంత కాలం బీజేపీతో కేసీఆర్ స్నేహపూర్వకంగా మెదిలారు.

బీజేపీ సీఎంల కంటే ఎక్కువగా పీఎం మోడీనే పొగిడారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీతో వైర్యం ఏర్పడటంతో నెమ్మదిగా ఆ పార్టీకి దూరమవుతూ వచ్చారు. ప్రస్తుతం బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కేసీఆర్.. తమను వీక్ చేసేందుకే ఇలా బీజేపీతో కలిసి నాటకమాడుతున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుండటం గమనార్హం. అందుకే కేసీఆర్‌ను ఏఐసీసీ నమ్మడం లేదనే ప్రచారం జరుగుతున్నది.

కాంగ్రెస్ గొడుకు కిందకి విపక్ష పార్టీల సీఎంలు

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని కంకణం కట్టుకున్న విపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో హస్తం పార్టీ నేతృత్వంలో కూటమి ఏర్పడాలని ఏఐసీసీ ప్లాన్ వేసింది. అందులో భాగంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్ష పార్టీల సీఎంలు, లీడర్లను ఆహ్వానించింది.

ఆహ్వానం అందుకున్న వారిలో తమిళినాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ హాజరయ్యారు. కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ గైర్హాజరయ్యారు. మరో వైపు తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఏఐసీసీ తరఫున ఆహ్వానం అందలేదు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎఫెక్ట్

కర్ణాటకలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్.. తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకున్నది. అందుకోసం త్వరలో ఏఐసీసీ నేతలు రాష్ట్రంలో పర్యటించే షెడ్యూలు రెడీ అవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను ఆహ్వానిస్తే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నదని, బీఆర్ఎస్‌తో ఫైట్ చేయాలని పట్టుదల నీరుకారే ప్రమాదముందని, విమర్శించేందుకు బీజేపీ లీడర్లకు ఇది ఓ అస్త్రం ఇచ్చినట్టవుతున్నదని కాంగ్రెస్ పార్టీ భావించినట్టు సమాచారం.

Read more:

బీసీలకు రూ.లక్ష స్కీమ్ వెనుక భారీ ప్లాన్.. దానికి భయపడే KCR హుటాహుటి ప్రకటన..?

Advertisement

Next Story