కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ బిగ్ స్కెచ్.. హరీశ్ రావునే టార్గెట్ వెనుక వ్యూహం ఇదేనా?

by Prasad Jukanti |
కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ బిగ్ స్కెచ్.. హరీశ్ రావునే టార్గెట్ వెనుక వ్యూహం ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాజకీయాలు హోరాహోరీగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు డైనమైట్ ల్లా పేలుతున్నాయి. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని మరికొన్నాళ్లు పదిలం చేసుకునేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేస్తుంటే.. మొన్నటి ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉన్నా వచ్చే సారైనా అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం ముందున్న పార్లమెంట్ ఎన్నికలను అనువుగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూనే బీఆర్ఎస్ పై టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ లో హరీశ్ రావునే టార్గెట్ చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ పై 'హరీశ్' అస్త్రం:

అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పార్టీ గ్రాఫ్ ను పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి సాధించేందుకు ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. పార్టీ ఓటమి తర్వాత ఇటీవలే బయటకు వచ్చిన గులాబీ బాస్.. నల్గొండ వేదికగా కాంగ్రెస్, బీజేపీలకు ధ్వజమెత్తారు. గులాబీ బాస్ వైఖరి ఇలా ఉంటే కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ లో హరీశ్ రావు టార్గెట్ గా చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ కారిడార్ లో ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. హరీశ్ రావు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉందని కానీ ఆయన మరో ఔరంగజేబు అవతారమెత్తి వెన్నుపోటు పొడిస్తే తప్ప ఆయనకు ఆ పదవి దక్కదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ హరీశ్ రావుకు ముఖ్యమంత్రి అవ్వాలనే ప్లాన్ ఉందని అయితే ఆ పార్టీలోనే ఉంటే ఆయన కనీసం ఎల్పీ లీడర్ కూడా కాలేడని హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే అందుకు తాము సపోర్ట్ చేస్తామని, బీఆర్ఎస్ లోని 26 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ లో చేరితే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. హరీశ్ రావు కష్టజీవి అని ప్రశంసిస్తూనే బీఆర్ఎస్ లోనే కొనసాగితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డి వ్యాఖ్యలు ఇలా ఉంటే తాజాగా బండి సంజయ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదంటూనే పార్టీలో చేరుతామంటే హరీశ్ రావుకు వెల్క కమ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేసీఆర్ పై అస్త్రాన్ని ప్రయోగించే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్, బీజేపీలు హరీశ్ పై గురిపెడుతున్నాయా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

కేటీఆర్ ను కాదని హరీశ్ రావునే టార్గెట్:

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆరే అయినా షాడో సీఎంగా కేటీఆర్ వ్యవహరించి అన్ని శాఖలపై తానే పెత్తనం చెలాయించారనే విమర్శ ఉంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉన్నా అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పెట్టడంలో కేటీఆర్ విఫలం అయ్యారనే చర్చ జరుగుతోంది. ఆయన ఎత్తుకున్న ప్రతి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీకి బూమరాంగ్ అవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీశ్ రావా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీలు హరీశ్ రావును టార్గెట్ చేస్తుండటం ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా చేస్తామంటున్న కాంగ్రెస్, బీజేపీలు ఇందుకోసం పార్టీనుంచి కీలక నేతలను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. ఇప్పటికే పలువుకు కాంగ్రెస్ లోకి చేరగా బీజేపీ సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని చెబుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ఎక్ నాథ్ షిండే ఎవరనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్న వేళ హరీశ్ రావు సెంట్రింక్ గా ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం వెనుక ఏం జరుగుతోందనే చర్చ గులాబీ పార్టీలో గుప్పుమంటోంది.

Advertisement

Next Story

Most Viewed