ప్రియాంక గాంధీ టూర్ ముందు టీ-కాంగ్రెస్ నేతల తలోదారి!

by GSrikanth |
ప్రియాంక గాంధీ టూర్ ముందు టీ-కాంగ్రెస్ నేతల తలోదారి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పరిస్థితులు కుదుట పడడం లేదు. ఆల్ సెటిల్డ్ అనుకునే లోపే మరో కొత్త సమస్య తెరమీదకు వస్తోంది. పార్టీలో చెలరేగిన తాజా పరిణామాలు మరోసారి క్యాడర్‌ను కన్ఫ్యూజన్‌కు గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆ పార్టీలో నేతల తీరు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారుతున్నాయి. పీసీసీ రేవంత్ రెడ్డి విషయంలో అలకబూనిన సీనియర్లను ఎంత సముదాయించినా పరిస్థితి సద్దుమణగడం లేదు. ఏదో రూపంలో రాష్ట్ర ముఖ్య నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం సొంత పార్టీలోనే విమర్శలకు తావిస్తోంది. త్వరలో ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటిచబోతున్నట్లు ఇప్పటికే పీసీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేతల తలోదారి కాంగ్రెస్‌లో దుమారం క్రియేట్ చేస్తోంది.

మొన్న జరిగిన మంచిర్యాల సభలో దళిత సీఎం అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ సభలో రేవంత్ విషయంలో సీనియర్ల వైఖరి అవమానించేలా ఉందనే చర్చ ముగిసిపోకముందే నల్గొండ నిరుద్యోగ నిరసన దీక్షపై ఉత్తమ్ కుమార్ అలక హాట్ టాపిక్ అయింది. అనంతరం పార్టీ పెద్దల జోక్యంతో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడినా..ఆలోపే ఖమ్మం జిల్లాలో రేవంత్ ర్యాలీ సందర్భంగా రేణుకా చౌదరి చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. రేణుకా చౌదరి భట్టి టార్గెట్ గా కామెంట్స్ చేశారనే టాక్ పార్టీలో వినిపించింది. ఆ వ్యవహారం కూడా ఇలా ముగిసిందనుకునే లోపే తాజాగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీలో అలజడి రేపుతున్నాయి. పార్టీలో ప్రశాంతత వాతావరణం లేదని, మానసికంగా కృంగిపోతున్నానంటూ జగ్గరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆవేదన పేరిట వరుసగా లేఖల విడుదల హాట్ టాపిక్ అయ్యాయి. ప్రియాంక గాంధీ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీలో నేతలు చేస్తున్న వరుస ప్రకటనలు క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ నేతలు ఆ విషయాన్ని పక్కన పెట్టి సొంత పార్టీ నేతలపైనే కత్తులు దూస్తున్నారని పరిస్థితి ఇలానే కొనసాగితే పార్టీకి నష్టం తప్పదనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోది. కొంత మంది సీనియర్లు రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. దాంతో వారు చేస్తున్న ప్రకటనల వల్ల రేవంత్ రెడ్డికి నష్టమెంతా పార్టీకు జరుగుతున్న నష్టం ఎంత అనే చర్చ తెరపైకి వస్తోంది. రేవంత్ వర్సెస్ సీనియర్ల మధ్య విభేదాలు కొనసాగుతుండగానే ఇంతలో కొంత మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న హస్తం పార్టీ నేతలు పార్టీలో పరిస్థితులను ఎప్పుడు చక్కబెట్టుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed