Congress : ‘లోకల్’ టికెట్లకు కాంగ్రెస్‌లో కాంపిటీషన్.. మంత్రుల చుట్టూ స్థానిక లీడర్ల చక్కర్లు

by Rajesh |   ( Updated:2024-07-22 03:31:21.0  )
Congress : ‘లోకల్’ టికెట్లకు కాంగ్రెస్‌లో కాంపిటీషన్.. మంత్రుల చుట్టూ స్థానిక లీడర్ల చక్కర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ లో టికెట్ల కాంపిటీషన్ నెలకొన్నది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లకు పుల్ పోటీ ఉన్నది. తమకే టికెట్ ఇవ్వాలని పలువురు ఆశావహులు మంత్రుల చూట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడు తమకే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన లోక్ సభలోనూ తన ఓటింగ్ శాతం పెంచుకొని సత్తా చాటింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఎన్నికల కసరత్తును మొదలు పెట్టింది. మెజార్టీ స్థానాలు తమవేనంటూ మంత్రులు ప్రచారం చేయడంతో, లోకల్ కేడర్ లో టికెట్ల ఆశలు రెట్టింపయ్యాయి. టికెట్ వస్తే కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల మంత్రులతోపాటు కొందరు సీఎంతో సన్నిహితంగా ఉండే నేతలనూ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పథకాలతో పాజిటివ్..

మేనిఫెస్టోలో ప్రకటించినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రూ. రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టింది. ఇప్పటికే రూ.లక్ష రూపాయలు రుణాలున్న చాలా మంది రైతులకు డబ్బులు జమ అయ్యాయి. ఇది కాంగ్రెస్ గ్రాఫ్ ను మరింత పెంచింది. పబ్లిక్ లో మరింత పాజిటివ్ వేవ్ వచ్చిందని పార్టీ ముఖ్యనేతలు చెప్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వంపై పాజిటివిటీ పెరుగుతుండడంతో స్థానిక నేతలు టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టారు. గ్రామం నుంచి జిల్లాల వరకు ఆశావహులు రిక్వెస్టులు పెట్టుకుంటున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో ఇద్దరు, ముగ్గురు మంత్రులు ఉన్నారు. దీంతో రాష్ట్ర పార్టీ ఎవరు సూచించిన వారికి టికెట్ ఇస్తుందనేద ఆసక్తికరంగా మారింది.

పదేళ్ల పవర్‌పై ఆశ

పది సంవత్సరాలు పక్కా అధికారంలోనే ఉంటామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలు సభలు, మీటింగ్ లలో నొక్కి చెప్పారు. తెలంగాణలో రెండు టర్ముల పాలనను ప్రజలు ఆమోదిస్తారని ఆయన వివరించారు. దీంతో ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ చేయడంతో స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరడం అనివార్యమైంది. దీంతో పదేళ్లు పవర్ పక్కా అంటూ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా చేరిన వాళ్లతో పాటు ఏళ్ల తరబడి పనిచేస్తున్న నేతలను సమన్వయం చేస్తూ టికెట్లను కేటాయించడం టీపీసీసీకి సవాల్ గా మారనున్నది.

Advertisement

Next Story

Most Viewed