జగిత్యాల బీఆర్ఎస్‌లో కోల్డ్ వార్.. ఆ ముగ్గురిలో పొలిటికల్ గ్యాప్.?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-28 07:53:44.0  )
జగిత్యాల బీఆర్ఎస్‌లో కోల్డ్ వార్.. ఆ ముగ్గురిలో పొలిటికల్ గ్యాప్.?
X

దిశ,జగిత్యాల ప్రతినిధి : ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తుంటే జగిత్యాల జిల్లాలో మాత్రం అధికార పార్టీలో కోల్డ్ వార్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. మళ్ళీ అధికారమే లక్ష్యంగా పని చేయాలనీ అధిష్టానం సూచించినప్పటికి జిల్లాలోని ముగ్గురు ముఖ్య నాయకుల మధ్య పొలిటికల్ గ్యాప్ ఏర్పడిందని బీఆర్ఎస్ వర్గాలే చర్చించుకుంటున్నాయి.

ఇదే అదునుగా భావిస్తున్న ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బీఆర్ఎస్ పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు లేవనెత్తుతూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ అధికార పార్టీకి చెందిన ఆ ముగ్గురు నాయకులు ఎవరు? వారి మధ్యలో ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కేటీర్ సర్వేనే కారణమా?

మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య పొలిటికల్ గ్యాప్ ఏర్పడిందని అధికార బీఆర్ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మార్చ్ 18న నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పట్ల మంత్రి వ్యవహరించిన తీరు ఇందుకు అద్దం పడుతుంది. ఆ తర్వాత మార్చి 24న రాయికల్‌లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే అనుచరులు హాజరు కాకపోవడంతో వీరి మధ్య గ్యాప్ వచ్చిందనే వాదనలకు బలాన్ని చేకూర్చాయి.

అయితే వీరిద్దరి మధ్య ఆ గ్యాప్ ఏర్పడడానికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేయించిన ఓ సర్వేనే కారణమని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే సంజయ్ అత్యధిక మెజారిటీతో గెలిచినప్పటికీ నియోజకవర్గంలోనే ఉంటున్నాడని కానీ మంత్రి కొప్పుల మాత్రం స్వల్ప మెజారిటీతో గట్టెక్కగా మంత్రి అయ్యాక నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడంతో కొంత ప్రజా వ్యతిరేకత ఏర్పడినట్టు సమాచారం. ఈ కారణంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఉదహరిస్తూ కొప్పులను ప్రజల్లో ఉండాల్సిందిగా సూచించారని సమాచారం.

వారిద్దరికీ అంతే..

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు పొసగడం లేదని వాదనలు తెర మీదికి వస్తున్నాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్థానిక ఎమ్మెల్యేను పక్కన పెట్టి జెడ్పి చైర్ పర్సన్‌ను చేరదీస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ అనుచరుల్లో ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో విద్యాసాగర్ రావు తన కొడుకు సంజయ్‌ని బరిలో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో జడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్న దావా వసంత ఎమ్మెల్యే‌గా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. యువ నాయకుడిగా గుర్తింపు పొందిన వసంత భర్త సురేష్ ఎమ్మెల్సీ కవితకు ముఖ్య అనుచరుడిగా ఉండడం కూడా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు మింగుడు పడడం లేదనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీనితో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తీరుపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని కార్యకర్తలు భావిస్తుండగా అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అనుచరులు కొట్టి పారేస్తున్నారు.

Read more:

‘అమ్మాయిలను పంపాలని వేధిస్తున్నాడు’.. BRS ఎమ్మెల్యే చిన్నయ్యపై సంచలన ఆరోపణలు చేసిన యువతి

Advertisement

Next Story

Most Viewed