మేడిగడ్డ బ్యారేజ్‌‌పై త్వరలోనే కాపర్ డ్యామ్..

by Disha Web Desk 4 |
మేడిగడ్డ బ్యారేజ్‌‌పై త్వరలోనే కాపర్ డ్యామ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీని చక్కదిద్దే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. బ్యారేజీలోని ఏడో బ్లాకులో దెబ్బతిన్న పిల్లర్లను సరిదిద్దడంపై గత కొంతకాలంగా నిర్మాణ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డిఫెక్ట్ లయబిలిరీ ఒప్పందం గడువు తీరిపోయిందంటూ నిర్మాణ సంస్థ, నిర్మాణం పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రమే లేదని ప్రభుత్వం పరస్పరం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితుల్లో రానున్న వర్షాకాలం కల్లా బ్యారేజీకి రిపేర్ పనులను కంప్లీట్ చేసి మరింత డ్యామేజీ కాకుండా జాగ్రత్త చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఏడో బ్లాకులో మరమ్మతు పనులు మొదలుపెట్టడానికి ముందు అక్కడ అప్ స్ట్రీమ్ (బ్యారేజీకి ఎగువన – రిజర్వాయర్ వైపు) కాఫర్ డ్యామ్ నిర్మించడం అనివార్యంగా మారింది.

ఈ కాఫర్ డ్యామ్‌ను నిర్మాణ సంస్థ చేపట్టాలా? ... లేక ప్రభుత్వం నిర్మించాలా?.. అనే విషయంలో ఇంతకాలం స్పష్టత కొరవడింది. దీంతో ఆ పనులు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు వివాదం సద్దుమణిగింది. బ్యారేజీని కట్టిన ఎల్అండ్‌టీ కంపెనీయే కాఫర్ డ్యామ్ నిర్మించడానికి సిద్ధమవుతున్నట్ల ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు సైతం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాయి. దీంతో త్వరలోనే కాఫర్ డ్యామ్ నిర్మాణం మొదలుకానున్నది. అయితే బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో కుంగిపోయిన, పగుళ్లకు గురైన పిల్లర్లను ప్రభుత్వం నిర్మిస్తుందా?.. లేక నిర్మాణ సంస్థగా ఉన్న ఎల్అండ్‌టీ కంపెనీ నిర్మిస్తుందా?... అనేది స్పష్టం కావాల్సి ఉన్నది.

Next Story

Most Viewed