చంచల్‌గూడ జైలు తరలింపుపై CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

by Satheesh |   ( Updated:2024-03-08 15:40:24.0  )
చంచల్‌గూడ జైలు తరలింపుపై CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
X

దిశ, సిటీ బ్యూరో: పాతబస్తీ మధ్యలోనున్న చంచల్ గూడ జైలును తరలించి, అక్కడ విద్యార్థుల కోసం స్కూల్, కాలేజీలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఓల్డ్ సిటీ అంటేనే ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం పాతబస్తీలోని ఫలక్ నుమా సమీపంలోని ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద ఆయన ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు ఏర్పాటు చేయనున్న అయిదున్నర కిలోమీటర్ల మెట్రో కారిడార్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కోసం ఎందరో కృషి చేశారన్నారు. తాము కూడా హైదరాబాద్ నగర ప్రతిష్టను మరింత పెంచేలా మరిన్ని అభివృద్ది పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. తాము ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే పాలిటిక్స్ చేస్తామని, మిగతా సమయంలో అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.

ఒకప్పుడు పాతబస్తీకి జీవనదిగా ఉన్న మూసీ నది కాలక్రమేనా బక్కచిక్కి నేడు కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తిందని, మూసీ నదిని కాపాడుకుని పర్యాటరపరంగా అభివృద్ది చేసేందుకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ కోసం ఇప్పటికే లండన్‌లోని థేమ్స్ నదిని మజ్లీస్ శాసన సభ పక్ష నేత అక్బరుద్దీన్‌తో కలిసి సందర్శించామని స్పష్టం చేశారు. పాతబస్తీలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం మెట్రో రెండో దశ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ రెండు మార్గాలకు మధ్య చాంద్రాయణగుట్టలో మెట్రో ఇంటర్ ఛేంజ్ జంక్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ సిటీలోప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత సర్కారుదేనన్నారు. మైనారిటీల కోసం 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, ఈ విషయంలో ఎవరికెలాంటి సందేహాం అవసరం లేదని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. గండిపేట నుంచి నగరంలోని 55 కి.మీల పరిధిలోని మూసీ పరివహాక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ సీఎం రేవంత్ మొండి ఘటమని, పట్టుబడి మరీ సీఎం అయ్యారని, ఆయన సర్కారు చేస్తున్న ప్రతిపాదనలన్నీ ఫలించి నగరం మరింత అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్ అలీ తో పాటు వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed