తెలంగాణ మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

by GSrikanth |   ( Updated:2024-01-29 12:32:42.0  )
తెలంగాణ మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తన నియోజకవర్గం కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలని, అలా అయితే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇవాళ సచివాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి విస్తరణలో వచ్చే సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై రేపు హైకోర్టులో బెంచ్‌ ఉస్మానియా హెరిటేజ్ భవనం పిటిషన్ రానుందని.. కోర్టు డైరెక్షన్స్ ఆధారంగా ఎలా ముందుకు వెళ్లాలలనే అంశంపై నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ఏరియాల వారీగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్నింటిని గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో ఏదో ఒకదానిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ నెల 15వ తేదీలోగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలని సూచించారు. ప్రతీ మూడు నెలలకోసారి విధిగా ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలన్నారు.

Advertisement

Next Story