- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: ఫామ్‌హౌజ్ మత్తులో మునిగి నిరుద్యోగులను మరిచిన గత ప్రభుత్వం: సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఫామ్‌హౌజ్ మత్తులో మునిగి నిరుద్యోగులను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు 26 జిల్లాలకు చెందిన 5,192 మందికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. తమ ఉద్యోగాలు తమకు వస్తాయని యువత భావించారని అన్నారు.
కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి విరుద్ధంగా పని చేసిందని పేర్కొన్నారు. ఫామ్‌హౌజ్ మత్తులో మునిగి నిరుద్యోగులను పూర్తిగా మర్చిపోయారని అన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేవలం 3 నెలల్లో 30వేల ఉద్యోగాలను ఇచ్చామని అన్నారు. గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలను నెలకొల్పినా.. సరైన మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం విద్యా వ్యవస్థపై ఫోకస్ పెట్టిందని అందుకు అనుగుణంగా ఆ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడినేనని, కాన్వెంట్ బడుల్లో చదవలేదని అన్నారు. తన గురువులు సరైన విధంగా విద్యాబుద్ధులు నేర్పినందునే తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు. అందుకు తన గురువులకు ఎల్లప్పుడూ కృతజ్ఙుడనని తెలిపారు. తనకు ఇంగ్లీష్ రాదంటూ కొందరు అవహేళన చేస్తున్నారని పేర్కొన్నారు. చైనా, జపాన్, జర్మనీ ఆయా దేశాల్లో ఎవరికీ ఇంగ్లీష్ రాదని, కానీ ఆ దేశాలు ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్ర స్థానంలో ఉన్నాయనే విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు.
రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ రాని పరిస్థితి ఉండకూడదని అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తయారు చేయాలని పేర్కొన్నారు. నిరుద్యోగులకు భవిష్యత్తులో భరోసా కల్పించేందుకే ఈ నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఎవరికీ నష్టం జరగకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టామని అన్నారు. గతంలో సీఎం, మంత్రులు ఎవరినీ కలిసే వాళ్లు కాదని, ఇప్పుడు గడీలను బద్దలు కొట్టి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.