కేసీఆర్ చెప్పుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు పెట్టారు : సీపీఎం

by Bhoopathi Nagaiah |
కేసీఆర్ చెప్పుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు పెట్టారు : సీపీఎం
X

దిశ, డోర్నకల్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు విసిగివేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఇది కూడా అదే బాటలో నడుస్తుందని సీపీఎం కేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. నాగయ్య, ఎస్.వీరయ్య ఆరోపించారు. సభాధ్యక్షులు జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డోర్నకల్ పట్టణంలో బిషప్ హజారయ్య వేడుకల వేదికలో సీపీఐ(ఎం) మహబూబాబాద్ జిల్లా మూడవ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సభలకు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వీరయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.

కళలకు, క్రీడలకు, కమ్యూనిస్టు భావజాలం డోర్నకల్ పుట్టినిల్లని అభివర్ణించారు. గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో విసికి వేసారిన ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టిందన్నారు. పది నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైందని, ఇచ్చిన హమీలను ఎప్పుడూ అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. 18 సార్లు వేసిన ఇండ్ల గుడిసెలు పీకేస్తున్న భయపడని జనం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గుడిసెలు పీకితే భయపడతారని ఎలా అనుకున్నారని ప్రశ్నించారు. ఈ పాలకులు అరెస్టులు చేయడం, జైలుకు పంపించడం, జగిత్యాల, కోరుట్ల, జనగాం ప్రాంతాల్లో పేదలపై దాడులు చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఈ విషయమై నాలుగు సార్లు కలిసి కేసులు రద్దు చేయాలని కోరి ఏడాది అయ్యిందని గుర్తు చేశారు.

కేసీఆర్ వదిలిన చెప్పుల్లో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు పెట్టారని విమర్శించారు. ప్రజల హక్కుల పై పోరాటాలు చేయడం మాని ప్రభుత్వాలకు భజనలు చేయాలా అని ప్రశ్నించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పాలన గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంత మార్పులు జరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఫార్మాసిస్టు పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదని బాధితులు తిరగబడుతుంటే వాళ్లు రైతులే కాదని పాలకులు అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఓటమిపాలై ప్రజల చేతుల్లో తిరస్కరణకు గురైన బీఆర్ఎస్ నాయకులకు ఇంకా జ్ఞానోదయం కాకపోవడం విచారకరమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలనను ప్రజలు సహించరని ఎర్రజెండా అండతో ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

బీజేపీ, కాంగ్రెస్ పాలకులకు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకుంటే వారికి ఎర్రజెండా ఎల్లప్పుడూ అండగా ఉండి నిరంతరం పోరాటాలు చేస్తామని చెప్పారు. తొలుత ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పురవీధుల్లో మహిళలు కోలాటాలతో నాయకులకు ఘనస్వాగతం పలికారు. వేలాది మందితో సభా ప్రాంగణం వరకు ప్రదర్శన నిర్వహించారు. డోర్నకల్ పట్టణం ఎర్రజెండాలతో ఎరుపెక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, శెట్టి వెంకన్న, గుణగంటి రాజన్న, సుర్ణపు సోమయ్య, ఆకుల రాజు, అల్వాల వీరయ్య, కందునూరి శ్రీనివాస్, బి.ఆర్ వీరస్వామి, బొమ్మన అశోక్ కుమార్, ఉప్పనపల్లి శ్రీనివాస్, నవాబు, పుట్టా శ్రీనివాస్, జేవిఆర్, దాసరి మల్లేశం, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story