CM Revanth Reddy: రుణమాఫీపై విపక్షాలు వక్రభాష్యం చెప్పాయి: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-15 16:30:47.0  )
CM Revanth Reddy: రుణమాఫీపై విపక్షాలు వక్రభాష్యం చెప్పాయి: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటే విపక్షాలు వక్రభాష్యం చెప్పాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ గోల్కొండ కోటపై జాతీయ జెండాను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగఫలంతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. చరిత్రలో కనివిని ఎరుగని విధంగా అహింసనే అయుధంగా చేసుకుని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మందుచూపు వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. రాబోయే ముందు తరాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం వల్లే దేశం సుభిక్షంగా ఉందన్నారు. బీహెచ్‌ఈల్‌, మిధాని లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి ఆయన లక్షల మందికి ఉపాధి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దేశానికి చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేదని అన్నారు. తాజాగా, విదేశీ పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌తో సమావేశం అయ్యామని, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు వారు కూడా అంగీకరించారని తెలిపారు.

బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద భారం మోపే తత్వం తమ ప్రభుత్వానిది కాదని అన్నారు. ఎన్నికల సందర్భంగా వరంగల్ డిక్లరేషన్‌ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు. కానీ, ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ విపక్షాలు అందుకు వక్రభాష్యం చెప్పాయంటూ ఫైర్ అయ్యారు. రుణమాఫీలో అక్కడక్కడ తప్పులు దొర్లుతున్నాయని, టెక్నికల్ సమస్యలతో కొంత మంది రైతులకు రుణమాఫీ అందలేదని తెలిపారు. రుణమాఫీ కాని వారి కోసం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతుల పూర్తి వివరాలు అక్కడ అదందజేస్తే రుణమాఫీ తప్పకుండా అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు.

Advertisement

Next Story