KCR కాదు.. అసలైన తెలంగాణ బాపు ఆయనే: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-03-10 15:47:40.0  )
KCR కాదు.. అసలైన తెలంగాణ బాపు ఆయనే: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బాపు అని కేసీఆర్ తనకు తానే చెప్పుకుంటుండు.. అలా చెప్పుకోవడానికి కనీస పోలిక అయిన ఉండాలి.. అసలైన తెలంగాణ బాపు, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్దమని అన్నారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతారని ఫైర్ అయ్యారు.

ఆయన కుటుంబంలో రాష్ట్రం కోసం ఎవరి రక్తం చిందలేదేమో కానీ.. తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి లాంటి ఉద్యమకారులు మాంసపు ముద్దలయ్యారని గుర్తు చేశారు. గవర్నర్‌తో మాట్లాడి ప్రొఫెసర్ కోదండరాంను శాసన మండలికి పంపుతామని, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవమన్నారు. తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదన్నారు. తెలంగాణలో ఆదాయం పడిపోయింది.. ఇన్‌కమ్ కోసం కేవలం లిక్కర్‌పైనే రాష్ట్రం ఆధారపడేలా కేసీఆర్ పదేళ్ల పాలన సాగిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి తారీఖు ఉద్యోగులకు జీతాలు వేసినా మేం ప్రచారం కల్పించుకోలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మూడు నెలలు ఉంటది.. ఆరు నెలలు ఉంటదని కొందరు మాట్లాడుతున్నారు.. తమాషా అనుకుంటున్నారా..? అని హెచ్చరించారు. మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని.. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని అన్నారు. వచ్చే పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ గుర్తింపు సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే.. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed