సెంట్రల్ బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ నో కామెంట్

by Mahesh |   ( Updated:2023-02-02 08:56:42.0  )
సెంట్రల్ బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ నో కామెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ మౌనం వహించారు. కేటాయింపులపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వంతో రాజకీయ వైర్యం ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌పై ఆయన ఫైర్ అవుతారని అందరూ భావించారు. కానీ 'తర్వాత చూద్దాంలే' అనే కామెంట్ చేసినట్లు తెలిసింది.

మౌనం వెనుక ఆంతర్యం ఏంటి ?

గతేడాది కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజున సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మోడీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని వ్యక్తిగతంగా దూషించారు. అప్పటి నుంచి సెంట్రల్ వర్సెస్ స్టేట్ అనే రీతిలో వివాదం సాగుతున్నది. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్రం పై స్పెషల్ ఫోకస్ పెట్టి కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి అడ్డాగా మారిందని పదే పదే విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ను కేసీఆర్ అస్త్రంగా చేసుకుని ఎటాక్ చేస్తారని అందరూ భావించారు. రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగిందనే విషయాన్ని బలంగా వివరించేందుకు ప్రయత్నిస్తారని అంచనా వేశారు. కానీ సీఎం మాత్రం మౌనం వహించారు. దీని వెనుక ఆంతర్యం ఏంటి? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

అసెంబ్లీ వేదికగా కౌంటర్..

ఈనెల 3వ తేదీ నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర కేటాయింపులపైనా విమర్శలు చేసే అవకాశం ఉన్నదని లీడర్లు భావిస్తున్నారు.

కేంద్ర కేటాయింపులపై సీఎంకు నోట్..

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన కేటాయింపులపై ఆర్థిక శాఖ ఓ నోట్ తయారు చేసినట్లు సమాచారం. ఈ నోట్‌ను సీఎం కేసీఆర్‌కు అందించినట్టు సమాచారం. ఏ శాఖలో ఏ మేరకు కేంద్ర నిధులు వస్తాయి? గతంలో కంటే ఏ సెక్టార్ లో నిధుల కోత జరిగింది? ఇలాంటి అంశాలపై పూర్తి నోట్ ను రెడీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలపై కేసీఆర్ సమయం, సందర్భం చూసుకుని స్పందించే చాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు.

Also Read...

ప్రజల్లోకి ''బడ్జెట్''.. ప్రతి గడపకు రీచ్ అయ్యేలా దేశవ్యాప్తంగా BJP స్పెషల్ డ్రైవ్!

Advertisement

Next Story