- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా KCR పోటీ.. ఆ నియోజకవర్గం నుండే బరిలోకి..!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని నాందేడ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారా? అందుకే ఆయన ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారా? పార్టీ విస్తరణలో భాగంగా ముందుగా ఆ రాష్ట్రానికి చెందిన నేతలను పార్టీ చేర్చుకోవడం వెనుక వ్యూహం ఇదేనా? అందుకే ఆ జిల్లాకు చెందిన వారినే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం ఈ ప్లాన్‌లో భాగమేనా? అందుకే నాందేడ్ జిల్లాలో రెండు బహిరంగసభలను పెట్టారా? అంటే ఆ పార్టీలో కొంతమంది నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది. నాందేడ్‌తో పాటు ఔరంగబాద్ స్థానాన్ని సైతం కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రానున్న జనరల్ ఎలక్షన్స్‌లో మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ అధినేత స్వయంగా అక్కడి నుంచి పోటీచేసి గెలిస్తే దాని ప్రభావం మొత్తం రాష్ట్రం మీద ఉంటుందని అక్కడి నేతలు అభిప్రాయపడుతున్నారు. నాందేడ్ సెగ్మెంట్ మీద ఫోకస్ పెట్టినా ప్రత్యామ్నాయంగా ఔరంగాబాద్‌నూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరికొంత విస్తృత అధ్యయనం తర్వాత ఎక్కడి నుంచి పోటీచేయాలన్న దానిపై కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చే చాన్స్ ఉన్నది. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత కేవలం మహారాష్ట్రపై మాత్రమే ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఎక్కువగా తెలంగాణకు సరిహద్దుగా ఉన్న నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాల మీదనే దృష్టి సారించారు.
ఆ జిల్లాలకు చెందిన నేతలనే పార్టీలో చేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు వివిధ పార్టీలకు చెందిన నేతలను వందల సంఖ్యలో బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన నేతలు కూడా వీరిలో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు నాందేడ్ జిల్లాలో పబ్లిక్ మీటింగ్స్ పెట్టిన బీఆర్ఎస్.. త్వరలో పొరుగున ఉన్న చంద్రాపూర్ జిల్లాలోనూ బహిరంగ సభను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇటీవల జరిగిన బోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినప్పటికీ ఇకపైన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నారు.
జాతీయ పార్టీగా గుర్తింపు కోసం..
జాతీయ పార్టీగా బీఆర్ఎస్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని మహారాష్ట్ర నుంచే స్టార్ట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తొలుత కర్ణాటక నుంచి బోణీ కొట్టాలని భావించి జేడీఎస్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించినా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరంగానే ఉన్నది. జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు ఆ పార్టీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించినా అది మాటలకే పరిమితమైంది. నాందేడ్ నుంచి బీఆర్ఎస్‌కు విస్తృతమైన మద్దతు లభిస్తూ ఉన్నదనే భావనలో ఉన్నారు గులాబీ బాస్.
భవిష్యత్తులో పరిస్థితులను మరింత అనుకూలంగా మార్చుకోవడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల నాటికి స్వయంగా నిలబడి గెలుపును సాధించడమే ఫోకస్‌గా రాజకీయ వ్యూహం రెడీ చేస్తున్నారు. పార్టీ అధినేతగా పరాయి రాష్ట్రంలో నిలబడి గెలవడం ద్వారా పార్టీ బలం పెరగడమే కాకుండా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌కు ఒక గుర్తింపు వస్తుందన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తున్నది.
రానున్న కాలంలో ఇది మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అవుతుందని, పార్టీ ఉనికి చాటుకోడానికి దారితీస్తుందనే అభిప్రాయమూ గులాబీ నేతల నుంచి వ్యక్తమవుతున్నది. మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న తెలంగాణ జిల్లాల నేతల నుంచి కూడా కేసీఆర్‌కు విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. అందుకే అక్కడి నుంచి పోటీ చేయడం సరైన ఆలోచన అంటూ అభిప్రాయపడుతున్నారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపండి అంటూ గతంలో నాందేడ్ జిల్లాలోని పలువురు సర్పంచ్‌లు కేసీఆర్‌కు రిక్వెస్ట్ పెట్టడంతో వారి మద్దతు గులాబీ బాస్‌కు లభిస్తుందని అంచనాకు వచ్చారు.
దేశ్ కా నేత అని అనిపించుకునేందుకు కేసీఆర్ నాందేడ్‌ను ఎంచుకుంటున్నట్టు టాక్. ఇప్పటికే ఒడిశాకు చెందిన గిరిధర్ గమాంగో, ఏపీ నుంచి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల శ్రీధర్ తదితరులు బీఆర్ఎస్‌లో చేరినా ఇంకా ఆ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై సీరియస్ దృష్టి పెట్టలేదని స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన అజిత్ జోగి కుమారుడితో మంతనాలు జరిపినా లాంఛనంగా చేరిక లాంటి యాక్టివిటీ ఊపందుకోలేదు.
పరిశీలనలో ఔరంగాబాద్ సైతం..
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాందేడ్‌తో పాటు ఔరంగాబాద్ స్థానం సైతం పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఔరంగాబాద్ స్థానానికి మజ్లిస్ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్నది. ఈ ప్రాంతంలో ముస్లిం ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్నది. తెలంగాణలో మజ్లిస్ పార్టీతో బీఆర్ఎస్ స్నేహసంబంధాలను కొనసాగిస్తూ మిత్రపక్షంగానే భావిస్తున్నందున ఔరంగాబాద్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే మజ్లిస్ సహకారంతో గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఎలాగూ ఏడాది సమయం ఉన్నందున అప్పటివరకూ బీఆర్ఎస్ పట్టు మరింత పెరుగుతుందని, ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమనే అంచనాలు బీఆర్ఎస్‌లో ఏర్పడ్డాయి.
నాందేడ్ పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నందున యాంటీ-బీజేపీ పొలిటికల్ స్ట్రాటెజీతో అక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే మొత్తం దేశానికి గట్టి మెసేజ్ వెళ్తుందన్నది గులాబీ నేతల వాదన. నాందేడ్‌లో ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే బీజేపీ గెలవగా 14 సార్లు (ఉప ఎన్నికలతో కలుపుకుని) కాంగ్రెస్ గెలిచింది. కానీ దేశవ్యాప్తంగా హస్తం పార్టీకి ఆదరణ తగ్గుతూ ఉండడంతో ఆ పార్టీ పెద్దగా పోటీ కాదనే భావన బీఆర్ఎస్‌లో వ్యక్తమవుతున్నది. ఔరంగాబాద్‌లో సైతం తొలినాళ్లలో కాంగ్రెస్ గెలిచినా 1990వ దశకం నుంచి శివసేన బలపడింది. ఈ సెగ్మెంట్‌లో ఎనిమిదిసార్లు కాంగ్రెస్, ఆరుసార్లు శివసేన గెలిచింది. ప్రస్తుతం మజ్లిస్ చేజిక్కించుకుంది.
యాంటీ-బీజేపీ వైఖరితో ఈ రెండింటిలో ఎక్కడి నుంచి పోటీ చేసినా కేసీఆర్‌కు గెలుపు ఖాయమనే గులాబీ నేతలు అంచనాకు వచ్చారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది కేసీఆర్‌ను నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి పోటీ చేయడానికే మద్దతు పలుకుతున్నారు. తెలంగాణతో సరిహద్దు ఉండడంతో పాటు నిజాం కాలం నుంచి సాంస్కృతిక, భౌగోళిక, రాజకీయ సంబంధాలు ఉండడం గమనార్హం. వంద శాతం గెలుపు కోసం తెలంగాణ మోడల్‌ను రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ప్రచారం చేసి నాందేడ్ సహా మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ ముద్రను వేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తున్నది. ప్రస్తుతానికి ఈ ఆలోచన ప్రాథమిక స్థాయిలోనే ఉన్నా రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే చాన్స్ ఉన్నది.
Also Read...
సచివాలయంలో సోమేశ్ చాంబర్ @ 6వ ఫ్లోర్.. ఎవరికీ కేటాయించకుండా ముందే రిజర్వ్