200 ఏళ్ల క్రితమే జ్యోతిరావు ఫూలే ఆ పనిచేశారు: సీఎం కేసీఆర్

by GSrikanth |   ( Updated:2023-04-10 15:06:43.0  )
200 ఏళ్ల క్రితమే జ్యోతిరావు ఫూలే ఆ పనిచేశారు: సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఫూలే 197వ జయంతి సందర్భంగా ఈ దేశానికి ఫూలే చేసిన సేవలు, త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా, దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఫూలే దాదాపు రెండొందల ఏండ్ల క్రితమే కార్యాచరణ చేపట్టారని అన్నారు. వారు అనుసరించిన సామాజిక సమానత్వ పంథా, నాటి భారతీయ సమాజంలో కొనసాగుతున్న సాంప్రదాయ సామాజిక విలువలను, వ్యవస్థలను సమూలంగా మార్చివేసేందుకు బాటలు వేసిందని సీఎం తెలిపారు. గుణాత్మక మార్పు దిశగా.. దేశంలోని స్త్రీలు, దళిత బహుజనులు ఉద్యమించేలా పూలే కార్యాచరణ పురికొల్పిందని సీఎం కేసీఆర్ అన్నారు.

మహాత్మా ఫూలేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా తన గురువుగా ప్రకటించుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. ఫూలే వంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చేదిశగా తెలంగాణ ప్రభుత్వం తన ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకుని అభివృద్ధి సంక్షేమ కార్యాచరణను అమలు చేస్తున్నదని కేసీఆర్ అన్నారు. ఆయన అందించిన స్ఫూర్తితో ‘వికాసమే వివక్షకు విరుగుడు’ అనే విధానాన్ని అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం పాటుపడుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేడు తెలంగాణలోని దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళలు.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించి సామాజిక సమానత్వ దిశగా పురోగమించాయని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఎక్కువశాతం బహుజన వర్గాలు లబ్ధిదారులుగా వున్నారని తెలిపారు. అందరితో పాటుగా.. దళితబంధు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక ప్రగతినిధి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి, పారిశ్రామికవేత్తలకు అండగా టిఎస్ ప్రైడ్, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గిరిజనులకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు వంటి అనేక కార్యక్రమాలను, ఎస్సీ ఎస్టీల ప్రగతి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అదే సందర్భంలో.. బీసీల వికాసానికి మహాత్యాజ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి, బీసీ గురుకులాలు, గొర్రెల పంపిణీ, బెస్త, ముదిరాజుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకం, బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గీత, చేనేత, మత్స్య కార్మికులకు ప్రమాద బీమా, కల్లు దుకాణాల పునరుద్ధరణ, గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు, నేతన్నకు చేయూత, సెలూన్లకు ఉచిత్ విద్యుత్ ద్వారా నాయి బ్రాహ్మణులకు చేయూత, రజకులకు ఆధునిక లాండ్రీ యంత్రాలు, దోభీ ఘాట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను సంబ్బండ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్నామని తెలిపారు. ఫూలే ఆశయ సాధన దిశగా మహిళలకు గురుకుల విద్యతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

అణగారిన వర్గాలు, బహుజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వారి సామాజిక, ఆర్థిక ఆత్మగౌరవాలను ద్విగుణీకృతం చేస్తున్నాయని సీఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ కృషి వెనుక మహాత్మా ఫూలే ఆదర్శాలు, ఆశయ సాధన లక్ష్యాలు ఇమిడి ఉన్నాయని సీఎం అన్నారు. తెలంగాణలో సాధిస్తున్న విజయాలు దేశానికి ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో భారత సమాజంలో అన్ని రంగాల్లో, అన్ని వర్గాలకు సమానత్వం ఆవిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తన కార్యాచరణను కొనసాగిస్తూనే ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read..

కర్ణాటక ఎన్నికల కోసం కేసీఆర్ వందల కోట్లు పంపుతున్నారు.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

Advertisement

Next Story