ఢిల్లీలో సీఎం కేసీఆర్-మునుగోడులో మంత్రులు.. ప్రజల పరిస్థితి ఇదే!

by GSrikanth |
ఢిల్లీలో సీఎం కేసీఆర్-మునుగోడులో మంత్రులు.. ప్రజల పరిస్థితి ఇదే!
X

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజా సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు. సీఎం కేసీఆర్ హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. జాతీయ రాజకీయాలు, పార్టీ ఆఫీసు నిర్మాణ పనులు చక్కబెట్టుకుంటున్నారు. మరో వైపు మంత్రులంతా దండుగా మునుగోడు ప్రచారానికి వెళ్లారు. దీంతో ప్రజా సమస్యలు కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాలన పడకేసింది. సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మునుగోడు బై ఎలక్షన్ ప్రచారంలో మంత్రులు ఉండగా, సీఎం కేసీఆర్ హస్తిన బాట పట్టారు. దీంతో ప్రజా సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ పార్టీ ఆఫీసుల నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టారు. వాస్తు పరమైన సలహాలు,సూచనలు ఇస్తూ బిజీ గా మారారు. సమస్యలను ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఆఫీసర్లు తికమకపడుతున్నారు.

ఆగమైన ఆసరా

ప్రతి నెలా ఒకటో తారీఖున రావాల్సిన ఆసరా పింఛన్లు ఆగమయ్యాయి. నెలాఖరు దాకా రావడం లేదు. ఒక్కో జిల్లాలో రెండు నెలలు దాటినా పైసలు రాని పరిస్థితి. వృద్ధులు పింఛను డబ్బుల కోసం గ్రామ పంచాయతీల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో కొత్తగా ఎంపిక చేసిన ఆసరా లబ్దిదారులకు ఇంత వరకు వారికి పెన్షన్ ఇవ్వలేదు. కేవలం కార్డులు పంపిణీ చేశారు. వారి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.

కల్యాణ లక్ష్మి కోసం

పెండ్లి అయిన ఆరు నెలల లోపు రావాల్సిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఏడాదిన్నర దాటినా అందడం లేదు. చాలా చోట్ల చెక్కుల కోసం పుట్టిన పిల్లలను చంకలో వేసుకుని లబ్దిదారులు ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం తలలు పట్టుకుంటున్నారు. చెక్కు త్వరగా వస్తుందని ఆశతో అప్పు తెచ్చి పెండ్లి చేశామని, ఇంతవరకు రాకపోవడంతో వడ్డీలు భారమవుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన సుమారు లక్ష మంది లబ్దిదారులు చెక్కులు పెండింగ్ ఉన్నట్టు సమాచారం.

విష జ్వరాల బారిన ప్రజలు

రాష్ట్రంలో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు విష జ్వరాల బారిన పడ్తున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు ఇతర నగరాల్లో సరైన శానిటేషన్ చేయట్లేదు. దీంతో డెంగీ, మలేరియా కేసులు విపరీతంగా నమోదవుతున్నారు. అక్టోబరు 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 వేల వరకు కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో విష జ్వరాల వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నట్టు ప్రభుత్వానికి రిపోర్టు వచ్చినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా మూడేండ్లుగా ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. కొత్త హెల్త్ కార్డుల్లో తమ వాటా కింద కొంత మొత్తం ఇస్తామని ఉద్యోగులు ముందుకు వచ్చినా ప్రభుత్వంలో మాత్రం కదలిక లేదు. దీంతో ఉద్యోగులు కూడా వైద్యం కోసం నానా కష్టాలు పడ్తున్నారు.

టీచర్ల అంశం పెండింగ్

కొత్త జిల్లాల ప్రకారం టీచర్లను బదిలీ చేసిన టైమ్ లో పరస్పర బదిలీలకు సర్కారు అవకాశం ఇచ్చింది. మిగతా అంశాలను పరిష్కరించలేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, టీచర్లు విద్యాశాఖ డైరెక్టర్ ఆఫీసు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పరస్పర బదిలీకి టీచర్లు సిద్ధంగా ఉన్న జీవో ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదంటూ టీచర్లు ఆగ్రహంతో ఉన్నారు.

పోడు గోడు వినేదెవరు?

పోడుభూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ మీటింగ్ జరగలేదు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల కూర్పుపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించింది. దీంతో పోడు భూముల సమస్యను పట్టించుకునే వారు కరువయ్యారు. గిరిజన రిజర్వేషన్ల పరిస్థితి అటకెక్కినట్టే కనిపిస్తున్నది. 6 నుంచి 10 శాతనికి ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ జీవో ఇచ్చిన సర్కారు దాన్ని అమలు చేసే విషయంలో చొరవ చూపడం లేదు. పెంచిన రిజర్వేషన్ల అమలు ఎప్పుడన్నది క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో పెంచిన రిజర్వేషన్లు ఎప్పట్నించి అమలు అవుతాయని టెన్షన్ గిరిజన విద్యార్థులు, నిరుద్యోగుల్లో నెలకొంది.

Advertisement

Next Story