బిగ్ న్యూస్: కర్నాటక రిజల్ట్‌తో KCR టార్గెట్ చేంజ్.. ఇకపై సీఎం ఫోకస్ ఆ పార్టీపైనే..?

by Satheesh |   ( Updated:2023-12-15 16:47:35.0  )
బిగ్ న్యూస్: కర్నాటక రిజల్ట్‌తో KCR టార్గెట్ చేంజ్.. ఇకపై సీఎం ఫోకస్ ఆ పార్టీపైనే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ ఫోకస్ బీజేపీ నుంచి కాంగ్రెస్ ఫైకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తున్నది.ఇంతకాలం కాంగ్రెస్‌ను లైట్ తీసుకున్న కేసీఆర్ ప్రస్తుతం ఆ పార్టీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. మొన్నటి వరకు బీజేపీపై ఫైర్ అయిన గులాబీ బీస్ తాజాగా నిర్వహించిన పార్టీ ఎల్పీ మీటింగ్‌లో కాంగ్రెస్ పైనే విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినా ఆ ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని మంత్రి కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే కామెంట్ చేశారు.

కర్ణాటక ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల్లోనే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించడం గమనార్హం. ఆ రాష్ట్రంలో ఒక పార్టీ ఒకసారి గెలిస్తే మరోసారి ఓడిపోవడం సహజమేనని గులాబీ నేతలతో పార్టీ అధినేత చెప్పుకొచ్చారు. ఆ రాష్ట్ర ఫలితాలను పట్టించుకోవద్దని, అక్కడ ఎవరు గెలిచినా ఆ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా ఉద్ధరించేదేమీ ఉండదని, 75 ఏండ్లలో ఆ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలిసిందేనని విమర్శలు గుప్పించారు.

ఇంతకాలం బీజేపీపై విరుచుకుపడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఎందుకు పల్లెత్తు మాట మాట్లాడలేదు? కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు అంటూ ఎందుకు నొక్కి చెప్పాల్సి వచ్చింది? డెబ్బై ఏండ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదంటూనే ఆ పార్టీని ప్రజలు నమ్మరని ఎందుకు ప్రస్తావించారు? ఇవే ఇప్పుడు బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న చర్చలు. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని సూచిస్తూనే నెలలో 21 రోజుల పాటు నియోజకవర్గాల్లో ప్రజల మధ్యనే ఉండాలని సీఎం ఆదేశించడం గమనార్హం.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వందకు పైగా స్థానాలు బీఆర్ఎస్‌కు ఖాయమని భరోసా నింపుతూనే ప్రజలను మంచిగా చూసుకోవాలని, శక్తిని ఏకీకృతం చేసుకోవాలని పిలుపునివ్వడం ఎమ్మెల్యేలలో సరికొత్త అనుమానాలను రేకెత్తించింది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని బఫూన్ అంటూ గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించగా అదానీ మీద హిండెన్‌బర్గ్ వెలువరించిన రిపోర్టుపై పార్లమెంటులో చర్చ జరగాలంటూ కాంగ్రెస్‌తో పాటు కలిసి బీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేయడం అప్పట్లో వివాదానికి దారితీసింది.

కాంగ్రెస్ పని అయిపోయిందని స్వయంగా కేసీఆర్ గతంలో వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు కర్ణాటకలో ఆ పార్టీ విజయం సాధించడం తెలంగాణలో చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నొక్కిచెప్పడం వెనక ఇకపైన ఆ పార్టీతో అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించడమా? లేక బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్నవారు వెళ్లిపోకుండా నిరుత్సాహపర్చడంలో భాగమా? అన్న చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నాయి.

పరోక్షంగా..

కాంగ్రెస్ పార్టీ పని ఖతమైపోయిందని ఒకరు, వెయ్యి జాకీలు పెట్టి లేపినా లేవదని ఇంకొకరు విమర్శిస్తున్న సమయంలో కేసీఆర్ హఠాత్తుగా ఆ పార్టీ పైకి ఫోకస్ షిఫ్ట్ చేయడం పలు ఊహాగానాలకు దారితీసింది. ఇంతకాలం బీజేపీపై నిప్పులు చెరిగినా గులాబీ బాస్.. ఇప్పుడు ఆ పార్టీ పేరును కనీసం పలకకపోవడం గమనార్హం. కర్ణాటకలో బీజేపీ తరఫున స్వయంగా ప్రధాని ప్రచారం చేసినా ఓడిపోవడంతో తెలంగాణలో ఇక ఆ పార్టీ డౌన్ ఫాల్ మొదలైనట్లేనని, అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం పెద్దగా ఉండదని గులాబీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అనే మాటలు ఇంతకాలం వినిపించినా.. ఇప్పుడు దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే తీరులో కామెంట్స్ వస్తున్నాయి. తాజా సమావేశంలో కేసీఆర్ సైతం ఆ పార్టీ పేరును ప్రస్తావించకపోవడంతో ఇక రాష్ట్రంలో బీజేపీ పెద్దగా పోటీయే కాదనే మెసేజ్ గులాబీ శ్రేణుల్లోకి వెళ్లింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపును పట్టించుకోవద్దని, ఆ పార్టీతో భయపడాల్సిన పనే లేదని కేసీఆర్ పైకి చెబుతున్నా.. ఇకపైన పోటీ ఆ పార్టీతోనే అనే సందేశాన్ని పార్టీ లీడర్లకు ఇన్ డైరెక్ట్‌గా ఇచ్చినట్లయింది.

ప్రభుత్వ వ్యతిరేకతను ఇంతకాలం కాంగ్రెస్, బీజేపీ చీల్చుకుంటాయనే అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమయినా.. కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలోని రాజకీయాల్లో మార్పులు తప్పవనే భావనకు వచ్చినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలనాటికి తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు కాంగ్రెస్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ చెబుతున్నా.. పరోక్షంగా ఆ పార్టీయే ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉంటుందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను మాత్రమే ప్రస్తావించి బీజేపీ ఊసెత్తకపోవడం వెనక కేసీఆర్ పక్కా వ్యూహంతోనే ఉన్నారని చెప్పినట్టయింది.

బీఆర్ఎస్‌పై ప్రభావం?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. దానిని తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నది. ఇకపైన ఆ పార్టీ అగ్రనేతల పర్యటనలు రాష్ట్రంలో పెరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ జోష్.. బీఆర్ఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోననే చర్చ మొదలైంది. గ్రామ స్థాయిలో పథకాలపైనా, స్థానిక ఎమ్మెల్యేలపైనా, ప్రభుత్వ పాలనపైనా ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత ఇటీవల పలు సందర్భాల్లో బహిర్గతమవుతున్నది.

వాటిని కాంగ్రెస్ రాజకీయంగా వినియోగించుకుంటుందనే అనుమానాలు బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో రానున్న ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతాయనే సందేశాన్ని ఈ విస్తృత స్థాయి సమావేశం ద్వారా కేసీఆర్ పరోక్షంగా చెప్పారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed