కేసీఆర్‌కు షాకిచ్చిన ఛత్తీస్ గఢ్ సీఎం.. BRS పార్టీకి చిక్కులు తప్పవా?

by Nagaya |   ( Updated:2023-01-26 14:00:52.0  )
కేసీఆర్‌కు షాకిచ్చిన ఛత్తీస్ గఢ్ సీఎం.. BRS పార్టీకి చిక్కులు తప్పవా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ ఛత్తీస్ గఢ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఆ రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం భూపేష్ బఘెల్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలవారీ నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం జగదల్‌పూర్‌లోని లాల్ మైదాన్‌లో సీఎం భూపేష్ బఘెల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతిని ప్రకటిస్తూ దీనికి సంబంధించి ఒక విధానాన్ని రూపొందిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని బస్తర్, సుర్గుజా డివిజన్ మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల పండుగల నిర్వహణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 వేలు అందిస్తామన్నారు. ఇది కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

అలాగే మహిళా సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా వ్యాపారాలు, మహిళా స్టార్టప్‌ల కోసం వ్యాపార పరిశ్రమలను స్థాపించడానికి కొత్త పథకం ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల శాఖ అభివృద్ధి చేసిన పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న కర్మాగారాలకు ఆస్తిపన్ను సైతం మినహాయిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో జీవన ప్రమాణాల పెంపుదల, శ్రేయస్సు, స్వావలంబన ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయన్న భూపేష్.. రాష్ట్ర ప్రజల సహాకారం, మద్దతుతో ఛత్తీస్‌గఢ్‌ను అభివృద్ధి చేయడంలో విజయం సాధిస్తామని చెప్పారు. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికలకు మందు కాంగ్రెస్ ఇచ్చిన కీలక వాగ్దానాల్లో నిరుద్యోగ భృతి ఒక్కటి. ఈ హామీ కారణంగా అక్కడ 15 సంత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది.

ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు ముందు ఛత్తీస్ ఘడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ నిర్ణయం హిమాచల్ ప్రదేశ్ ఓటర్లలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కలిగేలా చేసింది. హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టేలా చేసింది. దాంతో హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేపట్టాక మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని ఎన్నికలు జరగాల్సిన మిగతా రాష్ట్రాల్లోని ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ ఇన్ డైరెక్ట్ సందేశం ఇస్తోందని ఇందులో భాగంగానే ఛత్తీస్ గఢ్ లో తాజాగా నిరుద్యోగ భృతి నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది.

కేసీఆర్‌ను చిక్కుల్లో పెడుతున్న కాంగ్రెస్ దూకుడు

ఇక తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్‌కు కాంగ్రెస్ అధిష్టానం వరుసగా షాక్‌లు ఇస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లను కేసీఆర్ తరచూ టార్గెట్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కేసీఆర్‌కు ఎన్నికల సమయంలో ఇబ్బందికర పరిస్థితులు తెచ్చేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ తో పాటు ఇటీవలే అధికారంలోకి వచ్చిన హిమాచల్ ప్రదేశ్ లోనూ పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే ఛత్తీస్ గఢ్ సర్కార్ నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ రెండు డిమాండ్లు కేసీఆర్ సర్కార్ పై చాలా కాలంగా ఉన్నాయి. నిజానికి నిరుద్యోగ భృతి అమలు చేస్తామని కేసీఆర్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చారు.

ఆ తర్వాత కనీసం ఆ ఊసే ఎత్తలేదు. పైగా ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలోనూ ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. దీంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇదే ఏడాది తెలంగాణలోనూ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తాము అధికారంలో ఉన్న చోట్ల ఒక్కో హామీ నెరవేర్చే ప్రయత్నాలు చేస్తుంటే అది బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మారే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. వచ్చే నెలలో త్రిపుర‌, మేఘాల‌య‌, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు పార్టీకి ఎలా కలిసి రానుందనేది కాలమే సమాధానం చెప్పనుంది.

ఇవి కూడా చదవండి: కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపో.. : విజయశాంతి


Advertisement

Next Story

Most Viewed