నిజామాబాద్ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. జనజాతరకు జనం కరువు

by Rajesh |
నిజామాబాద్ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. జనజాతరకు జనం కరువు
X

దిశ, నిజామాబాద్ ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచార బాధ్యతలను ఎత్తుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న కాంగ్రెస్ జనజాతరకు జనం కరువయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి నామినేషన్ వేయడంతో పాటు ఆయన ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ జనజాతరకు జనసమూహం కరువైంది. అసలే ఎండకాలం కావడం, సభ అనుకున్న సమయానికన్నా ఆలస్యం కావటం.. వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో నాయకులు విఫలం కావడంతో జనం పలుచబడ్డారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత పెరిగిందని, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో రెండే స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలువగా మిగిలిన మూడు చోట్ల ఓడిన అభ్యర్థులే ఇంచార్జిలుగా ఉన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య అర్బన్ స్థానంపై పేచి నెలకొంది. అంతేగాకుండా ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్‌లో ఇతర పార్టీలలో నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు రుచించడం లేదు.

సీఎం పర్యటన సందర్భంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందులో బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మరికొంత మంది మాత్రమే ప్రధానంగా జగిత్యాల జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బాల్కొండ నుంచి కార్యకర్తలు కొద్దిగానే హాజరయ్యారు. కలెక్టరేట్ గ్రౌండ్ లో సామర్థ్యం 3 వేల లోపు ఉండగా ఆ స్థాయిలో జనాన్ని రప్పించనప్పటికీ వారిని సీఎం వచ్చే సరికి ఆపే నాయకులు లేకుండాపోయారు. సీఎం ఆదిలాబాద్ బహిరంగ సభ ఆలస్యం కావడంతో నామినేషన్ కోసం జీవన్ రెడ్డి వేసిన ప్రణాళిక విఫలమైంది. రేవంత్ రెడ్డి రాకతోనే సభను పరిగెత్తించారు. మధ్యాహ్నం వేళ కార్యకర్తలకు అన్నసదుపాయం కల్పించకపోవడంతో ఎండవేడిమికి చాలా మంది వెనుదిరిగారు. కాంగ్రెస్ నాయకులు స్టేజ్‌పై ఎక్కేందుకు చూపిన ఆసక్తి జనాలను సభకు రప్పించడంలో చూపలేదనే విమర్శలొస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సభలోనే కాంగ్రెస్ నాయకుల వ్యవహర శైలి చూసి కార్యకర్తలే ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ప్రచారంలో ప్రజలను ఆకట్టుకోవడంలో ఓటర్లను పోలింగ్ బూత్ కు తీసుకురావడంలో కాంగ్రెస్ నాయకుల వైఖరి ఎలా ఉంటుందో అని సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed