Telangana Secretariat: బెటాలియన్ పోలీసుల ఆందోళనలు.. లైక్, షేర్ చేసినా చర్యలు: సీఎస్ వో

by Prasad Jukanti |   ( Updated:2024-10-28 13:59:30.0  )
Telangana Secretariat: బెటాలియన్ పోలీసుల ఆందోళనలు.. లైక్, షేర్ చేసినా చర్యలు: సీఎస్ వో
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బెటాలియన్ పోలీసుల (Battalion Police) ఆందోళనల నేపథ్యంలో సచివాలయ (Telangana Secretariat) భద్రతా సిబ్బందిపై ప్రభుత్వం నిఘా పెంచింది. సిబ్బంది కదలికలు, వారి సోషల్ మీడియా యాక్టివిటీస్ పై ఫోకస్ పెంచింది. ఈ మేరకు సోమవారం సచివాలయ సిబ్బందికి పలు ఆదేశాలను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CSO) జారీ చేశారు. ఇవాళ్టి నుంచి సచివాలయం చుట్టూ 2 కి.మీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటం, ధర్నాలు, రాస్తారోకోలు, సచివాలయ ముట్టడి లాంటి వాటిల్లో పాల్గొంటే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు తోటి సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నందున ఇక్కడి సిబ్బంది అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, ఏ ఒక్కరు తప్పు చేసినా ఆ ప్రభావం అందరి మీద పడుతుందని పేర్కొన్నారు. కొంతమంది వాట్సాప్ ((Whatsapp)) గ్రూప్ లో అడ్మిన్ గా వ్యవహరిస్తూ మిగతా సిబ్బందిని ఆ గ్రూప్ లలో యాడ్ చేస్తూ టీజీఎస్పీ వ్యవస్థ గురించి, పోలీసు ఉన్నతాధికారుల గురించి రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారని, కానీ మీ ప్రతి కదలికపై నిఘా పెట్టామని తెలిపారు. అటువంటి గ్రూప్ లలో ఎవరైనా ఉంటే తక్షణమే ఎగ్జిట్ కావాలని ఆదేశించారు. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎటువంటి ధర్నాలలో, ర్యాలీలు, రాస్తారోకోలు వంటి అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం, పోలీసు అధికారులకు వ్యతిరేకంగా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, టెలిగ్రామ్ లలో టీజీఎస్పీ వ్యవస్థ, పోలీసు ఆఫీసర్లు, ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పోస్టులు చేయడం లేదా అలాంటి వాటికి లైక్, షేర్, కామెంట్ లాంటివి చేయవద్దని ఒక వేళ అలా చేస్తే వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్ వో హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed