డిగ్రీ సిలబస్ మార్పు.. ఈ ఏడాది నుంచి అమలు

by D.Reddy |
డిగ్రీ సిలబస్ మార్పు.. ఈ ఏడాది నుంచి అమలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్నత విద్య రంగంలో కీలక మార్పులకు చేస్తూ, సిలబస్ మార్చేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. దీనికోసం ప్రత్యేకంగా ఆయా యూనివర్సిటీలు, నిపుణులతో కమిటీలను వేసింది. ఉన్నత విద్యలో ఉపాధికి అనుగుణంగా సిలబస్‌ను మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే వివిధ కోర్సులకు సంబంధించి సిలబస్ మార్పులపై కమిటీ సభ్యులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. ప్రస్తుతం ఆయా కోర్సులు చేసిన విద్యార్థులు తాము నేర్చుకున్న విద్య నైపుణ్యాలను నిజ జీవితంలో అనుసరించే పరిస్థితులు ఉండటం లేదు. ఫలితంగా విద్యార్థులు తరచు మనో వేదనకు గురవుతూ.. ఉపాధి మార్గాలను అన్వేషించడంలో విఫలమవుతూ చిన్న చిన్న కారణాలకే తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులను అన్ని రంగాల్లో విద్యా, వృత్తి నైపుణ్యాలు సాధించే విధంగా వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా కొత్త సిలబస్ మార్పులు దోహదం చేస్తాయని ఉన్నత విద్యామండలి భావిస్తుంది. అంతే కాకుండా, విద్యార్థులు ఆత్మనూన్యత భావానికి, అభద్రతకు గురికాకుండా ఉండేందుకు టీ-శాట్ ఆధ్వర్యంలో సైకాలజీ తరగతులను, విద్యార్థులు స్ఫూర్తి పొందేలా మోటీవేషనల్ స్పీకర్స్‌తో ప్రత్యేక క్లాసులను సైతం ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుంది.

ఉన్నత విద్యాకోర్సులన్నింటిలో సిలబస్ మార్పులు

డిగ్రీలో బీఏ, బీకాం., బీఎస్సీ, బీజెడ్సీ, బీబీఏ, బీఏబీఎడ్‌, బీఏ బీఎల్‌ తో పాటు ఇంజనీరింగ్, డిగ్రీలోనూ సిలబస్ మార్పు చేయనున్నారు. కాలేజీల్లో విద్యనభ్యసించిన తర్వాత పోటీ ప్రపంచంలో వారు ఉపాధి పొందగలిగేలా, వారు స్వయం శక్తి పై జీవించే విధంగా కోర్సులను తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతమున్న సిలబస్‌ను పూర్తిగా మార్చకుండా కేవలం ఉపాధిని కల్పించే విధంగా కొన్ని కీలక మార్పులు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే విద్యా నిపుణులతో దఫాదఫాలుగా చర్చలు జరపడంతో పాటు కమిటీలు వేశారు. కమిటీల సూచనలను సైతం ఉన్నత విద్యామండలి పరిగణలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఏ గ్రూప్‌లో ఏ కోర్ సబ్జెక్ట్‌లో ఎంత మేర సిలబస్ మార్చాలి అనే విషయాన్ని నిర్ణయించనున్నారు. విద్యార్థులకు అవసరమైన వృత్తి నైపుణ్యాలను కల్పించే విధంగా మార్పులను సూచించడంతో పాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ ఉండేందుకు దానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు.

ఈ విద్యా ఏడాది నుంచే అమలు

మార్చిన సిలబస్ పాఠ్యాంశాలను ఈ విద్యా ఏడాది నుంచే బోధించనున్నారు. ఈ విద్యా ఏడాది మార్చిన పాఠ్యాంశాలు సత్ఫలితాలను ఇస్తే ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా కోర్ సబ్జెక్టుల్లో పూర్తి స్థాయి మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ విద్యా ఏడాది ప్రారంభం నాటికి ఈ ప్రక్రియను అంతా పూర్తి చేయాలని భావిస్తున్నారు. సిలబస్ లో మార్పుల ద్వారా విద్యార్థులు సరికొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంతో పాటు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణిస్తారని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి.

పరిశ్రమలతో ఎంఓయూలు

విద్యార్థుల్లో విద్యా నైపుణ్యలతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లను అందించేందుకు ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఫార్మా, ఇతర పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకుంటుంది. కాగా, అన్ని ప్రైవేట్ కాలేజీలు సైతం మారిన సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులకు ఇంటర్న్ షిప్‌లకు అనుగుణంగా పరిశ్రమలతో ఎంఓయూలు కుదర్చుకోవాల్సి ఉంటుంది. ఇంటర్న్ షిప్‌లను అందించడం ద్వారా చదువు పూర్తికాగానే విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ఉపాధి పొందే వీలు కలుగుతుంది. అంతే కాకుండా, ఎంఓయూలు కుదుర్చుకున్న పరిశ్రమలు ఆయా అకాడమిక్ ఇయర్ చివరిలో జాబ్ మేళాలను నిర్వహించి ఇంటర్న్ షిఫ్‌లో సాధించిన అర్హత, అదేవిధంగా విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. విద్యార్థులు నైపుణ్యాలను సాధించే విధంగా సిలబస్ మార్పులు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

Next Story

Most Viewed