ప్రాణాలంటే లెక్కలేదా.. డేంజర్ మలుపులతో ముప్పు

by Aamani |
ప్రాణాలంటే లెక్కలేదా.. డేంజర్ మలుపులతో ముప్పు
X

దిశ,ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ సమీపంలో ఏడు ప్రమాదకర రోడ్డు మలుపులు ఉన్నాయి. ఈ రోడ్డు మార్గం మీదుగా ఝరాసంగం, రాయికోడ్, మునిపల్లి, వట్టిపల్లి, రేగోడు, అల్లాదుర్గ్ మండలాల ప్రజలు ప్రయాణిస్తుంటారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. ఇప్పటికే జిల్లా ఉన్నత అధికారులు సంబంధించిన అధికారులకు రోడ్డు ప్రమాదాల నివారణకు పలు చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానికంగా పనిచేస్తున్న అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. స్థానిక ఝరాసంగానికి చెందిన ఓ అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు జిల్లా, తాలూకా, మండల స్థాయి రోడ్ల భవనాల శాఖ అధికారులకు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వినిపించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోడ్డు మార్గాన ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఝరాసంగం కేతకి సంగమేశ్వర దేవస్థానానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు భారీ సంఖ్యలో అమావాస్య, పౌర్ణమి, ప్రతి ఆది, సోమ వారాలలో భక్తులు అధిక సంఖ్యలో వాహన రాకపోకలు కొనసాగిస్తుంటారు.

మాచ్నూర్ నుంచి ఝరాసంగం వరకు రోడ్డు భవనాల శాఖ రోడ్లపై ఎలాంటి సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్స్, స్పీడ్ లిమిట్స్, మలుపుల వద్ద వెడల్పులు, పిచ్చిముక్కల తొలగింపు లాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కుప్పానగర్ శివాజీ విగ్రహం సమీపాన ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ప్రమాదాల్లో మృతి చెందారు. పలు మూగ జీవాలు సైతం మృతి చెందాయి. కుప్పానగర్ శివారులోని జట్టప్ప బావి మూల, మల్లన్న గుట్ట క్రాస్ రోడ్, శివాజీ విగ్రహం, ప్రభుత్వ పాఠశాల, హైమద్ దర్గా, గొల్ల రవి పొలం వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. జహీరాబాద్ నుంచి కుప్పా నగర్ మీదుగా రోడ్డు మార్గంలో ఎల్లమ్మ దేవాలయం నుంచి పోచమ్మ వాగు వరకు వాహనాలు అతివేగంగా రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఝరాసంగం గోలి గట్టు కింద రోడ్డు వంతెన వద్ద ఇరువైపులా రోడ్డు కుంగిపోయి ప్రమాదాలు చోటు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయా మండలాలకు చెందిన ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed