స్థానిక ఎన్నికల లోపే కుల గణన : పీసీసీ చీఫ్ ​మహేష్ ​కుమార్ గౌడ్

by M.Rajitha |
స్థానిక ఎన్నికల లోపే కుల గణన : పీసీసీ చీఫ్ ​మహేష్ ​కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కుల గణన పేటెంట్ కాంగ్రెస్ కే దక్కుతుందని పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన బీసీ సంఘాల రాష్ట్ర విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్​ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... కుల గణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా చేసి తీరుతామని నొక్కి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించామని, ప్రాసెస్ ముందుకు వెళ్తుందన్నారు. కులగణన కోసం నాలుగు రోజుల్లో గైడ్ లైన్స్ విడుదల చేస్తామన్నారు. వారం పది రోజుల్లో కులగణన ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, ఇందులో బీసీలు ఎలాంటి సందేహ పడవద్దని భరోసా ఇచ్చారు. బీసీ బిడ్డగా, పీసీసీ చీఫ్​ గా కులగణన చేయించే బాధ్యత తనదేనని నొక్కి చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణను చేపట్టి స్థానిక సంస్థలు ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతామని స్వయంగా తానే వెల్లడించానని , ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. కులగణన కోసం బీసీ సంఘాలు చేసే పోరాటంలో తప్పులేదని, కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతం తగ్గించి బీసీలను రాజకీయంగా గొంతు కోసిన టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కులగణన అంటూ కొత్త పల్లవి అందుకుంటుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే వేదాలు వల్లించినట్టుగా ఉన్నదన్నారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కులగణన ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు, బీఆర్ఎస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీలకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన చేయకుండా, రాష్ట్రంలో చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి జపం లేకుండా తక్షణమే కులగలను నిర్వహించి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీలకు మేలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కులగణను చేపట్టాలని, గత ఆరు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టామని చివరిగా హైకోర్టులో కేసు కూడా వేశామని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఈ రోజు కుల గణన మార్చ్ పేరుతో హైదరాబాదులో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించామని, కానీ విషయం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సంఘాలను చర్చలకు పిలిచి హామీ ఇచ్చారన్నారు. దీంతో బీసీ కులగణన ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని బీసీలు విశ్వసిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుండారం గణేష్ చారి, బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగాని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed