హైడ్రాకు క్యాబ్ డ్రైవర్ మద్దతు..కారుపై హైడ్రా స్టిక్కర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-23 12:28:36.0  )
హైడ్రాకు క్యాబ్  డ్రైవర్ మద్దతు..కారుపై హైడ్రా స్టిక్కర్
X

దిశ, వెబ్ డెస్క్ :హైదరాబాద్ నగరంలో ఇప్పుడు హైడ్రా అంటేనే హడల్...ముఖ్యంగా ఇటీవల అక్రమిత కట్టడాల కూల్చివేతతో హైడ్రా రేకెత్తించిన భయం అంతాఇంతా కాదు. బడా బాబుల కంటే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల్లో హైడ్రా ఎక్కువగా గుబులు రేపింది. అయితే ఓ సామాన్య క్యాబ్ డ్రైవర్ తన కారుపై హైడ్రా స్టిక్కర్ వేసుకోవడం ఆసక్తికరంగా మారింది. అది చూసిన వారంతా ఈ కారు హైడ్రా సంస్థకు చెందినదా అని సందేహ పడుతున్నారు. హైడ్రాకు మద్దతుగా క్యాబ్ పై స్టిక్కర్ వేసుకున్న డ్రైవర్ మహ్మద్ హఫిజుద్ధిన్ వ్యవహారం వైరల్ గా మారింది. ఈ వ్యవహారాన్ని చూసిన దిశ టీవి ప్రతినిధి హఫిజుద్దిన్ ను కలిసి కారుపై హైడ్రా స్టిక్కర్ కథ ఏమిటని ఆరా తీశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పట్ల అభిమానంతో, హైడ్రా చేస్తున్న మంచిపనులకు మద్ధతుగా నా క్యాబ్ పై హైడ్రా స్టిక్కర్ వేసుకున్నట్లుగా వెల్లడించారు. సమాజంలో ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాల్సిందేనన్నారు.

రంగనాథ్ మంచి అధికారి అని, ఆయన మా వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు ఆయన సమర్ధత, రాజీలేని ఆయన పనితీరు గమనించానని, అప్పటి నుంచి ఆయనను అభిమానిస్తు వస్తున్నానన్నారు. హైడ్రా కమిషనర్ గా ఆయన మంచిపని చేస్తున్నారన్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణదారులపై హైడ్రా చర్యలు తీసుకోవడం సరైందేనన్నారు. ఇక్కడా కాంగ్రెస్ పార్టీనా మరో పార్టీ ప్రభుత్వమా అని కాకుండా నా మద్దతు ప్రభుత్వ ఏజెన్సీగా హైడ్రాకు ఉంటుందని, అలాగే రంగనాథ్ కు ఉంటుందన్నారు. అయితే ఆక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో అన్ని పర్మిషన్లు తీసుకుని, బ్యాంకు లోన్లు తీసుకుని కట్టుకున్న ఇండ్లను కూల్చడం సరికాదన్నారు. బాధితులకు న్యాయం చేశాకే ఆక్రమణలపైన చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు.

Advertisement

Next Story