దూకుడు పెంచిన టీ-టీడీపీ.. ప్రతీ గడపనూ టచ్ చేసేలా ప్లాన్!

by GSrikanth |   ( Updated:2023-01-02 02:33:19.0  )
దూకుడు పెంచిన టీ-టీడీపీ.. ప్రతీ గడపనూ టచ్ చేసేలా ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు చేరువయ్యేందుకు టీడీపీ ప్రణాళికలు చేపట్టింది. బస్సుయాత్రతో రాష్ట్రమంతా పర్యటించేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. సెగ్మెంట్ల వారీగా పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ అనుబంధ సంఘాలతో గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టడంతోపాటు మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి బొట్టు, టీడీపీ చేసిన అభివృద్ధిపై కరపత్రాలు పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. బస్సుయాత్రలో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో సింహగర్జన బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. అదే విధంగా నియోజకవర్గంలో యాక్టీవ్ గా పనిచేస్తున్న నేతల వివరాలను సైతం సేకరించనున్నారు. పనితీరును ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తామనే విషయాన్ని సైతం స్పష్టత ఇస్తామని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

పాదయాత్రలు సైతం..

టీడీపీ మండల, అనుబంధ కమిటీలతో అన్ని గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించేందుకు సైతం షెడ్యూల్ ను రూపొందించారు. ఆ షెడ్యూల్ ప్రకారం మండలంలోని అన్ని గ్రామాల్లో యాత్రలు చేపట్టనున్నారు. అంతకు ముందు కమిటీలు లేని గ్రామాల్లో నూతన కమిటీలు వేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధిని వివరించనున్నారు. గ్రామాల్లో పార్టీని వీడిన వారిని సైతం తిరిగి టీడీపీలోకి ఆహ్వానించే బాధ్యతను మండల కమిటీకి అప్పగించినట్లు తెలిసింది.

గడపగడపకు 'బొట్టు'

మహిళా కమిటీ ఆధ్వర్యంలో గడపగడపకు బొట్టు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. మహిళలకు బొట్టు పెట్టి టీడీపీ మహిళా కార్యకర్తలు అన్ని వర్గాలకు చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. వారిని టీడీపీవైపు ఆకర్షిచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధమే: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీ కేడర్ ను సన్నద్ధం చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. మరో వైపు పార్టీని వీడినవారిని సొంతగూటికీ వచ్చేలా ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్ లో నూతన సంవత్సరవేడుకలను నిర్వహించి మాట్లాడారు. కొత్త సంవత్సరంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లో సభలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసాచారి, ఇందిర, అశోక్, సూర్యదేవర లత, కసిరెడ్డి శేఖర్ రెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు.

Also Read...

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల కీలక నిర్ణయం!

Advertisement

Next Story