తెలంగాణలోనూ బుల్లెట్ రైలు తరహా వ్యవస్థలు తేవాలి!.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
తెలంగాణలోనూ బుల్లెట్ రైలు తరహా వ్యవస్థలు తేవాలి!.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉన్నారు. వివిధ దేశాల్లో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ లో పర్యటిస్తున్న ఆయన తోషిబా కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై జపాన్‌లోని తోషిబా ప్రతినిధులతో ఏర్పాటైన ఉత్పాదక సమావేశం ముగిసిందని, తెలంగాణలో ఫ్యూయల్ సెల్ పరిశ్రమలను స్థాపించడానికి జపాన్ కంపెనీలను ఆహ్వానించామని తెలిపారు.

అలాగే మన రాష్ట్రం గ్రీన్ ఎనర్జీతో ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. పెద్ద-స్థాయి సోలార్ ప్లాంట్లు, ఇంధన సెల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీలు, విద్యుత్ ఉత్పత్తి మరియు నిల్వ పరిష్కారాలు వంటి పలు అంశాలలో తోషిబా కంపెనీతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే జపాన్ బుల్లెట్ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణాకు ఒక నమూనాగా ఉందని, తెలంగాణలోనూ ఇలాంటి వ్యవస్థలను అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే శాఖను అభ్యర్థిస్తానని చెప్పారు. అంతేగాక రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులను త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని భావిస్తున్నామని, తెలంగాణలో స్థిరమైన రవాణా కోసం మా నిబద్ధతను మరింత ముందుకు తీసుకువెళతామని భట్టి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed