BRS: ధర్నాలతో దద్దరిల్లుతున్న తెలంగాణ.. మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2024-10-25 11:04:52.0  )
BRS: ధర్నాలతో దద్దరిల్లుతున్న తెలంగాణ.. మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిరసనలు వెళ్లువెత్తుతున్నాయని, ధర్నాలతో తెలంగాణ దద్దరిల్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పలు చోట్ల నిరసనలకు సంబంధించిన వార్తలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దీనిపై కేటీఆర్.. దద్దమ్మ పాలనలో ధర్నాలతో తెలంగాణ రాష్ట్రం దద్దరిల్లుతున్నదని, దిక్కుమాలిన పాలనలో జీవితాలు దిక్కుమొక్కు లేకుండా తయారయ్యాయని ఆరోపించారు. అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు.. గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకు, రైతు నుండి రైస్ మిల్లర్ల వరకు నిరసనలు తెలుపుతున్నారని అన్నారు.

అలాగే కార్మికుని నుండి కాంట్రాక్టర్ల వరకు, టీచర్ల నుండి పోలీస్ కుటుంబాల వరకు, అవ్వతాతల నుండి ఆడబిడ్డల వరకు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. అంతేగాక విద్యార్థుల నుండి విద్యావంతుల వరకు, నిరుద్యోగులు మొదలు ఉద్యోగుల వరకు, కాంగ్రెస్ ప్రజాపతినిధుల నుండి ప్రతిపక్ష నాయకుల వరకు, ఒక్కరా.. ఇద్దరా.. ముగ్గురా.. మూలకున్న ముసలవ్వ మొదలు బడిపిల్లల దాక ధర్నాల బాట పట్టారని వ్యాఖ్యానించారు. ఇక వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని అంతటా ఒకటే స్లోగన్ వినిపిస్తోందని, కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు తెచ్చిందని కేటీఆర్ అన్నారు.

Advertisement

Next Story