Farmers protest:కాళ్లు మొక్కుతా సార్​...కనికరించండి...

by Sridhar Babu |
Farmers protest:కాళ్లు మొక్కుతా సార్​...కనికరించండి...
X

దిశ, ఆదిలాబాద్ : కాళ్లు మొక్కుతా సార్​...కనికరించండి...అంటూ ఓ రైతు కలెక్టర్​ కాళ్లమీద పడి వేడుకున్నాడు. మద్దతు ధర చెల్లించేలా చూడాలని ప్రాధేయపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డు (Adilabad District Agricultural Market Yard)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే పత్తి కొనుగోలు విషయంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ఎప్పటిలాగే మద్దతు ధర, తేమ లొల్లితో రైతులు రోడ్డెక్కారు. ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah)అధ్యక్షతన మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లకు వేలం పాట ప్రారంభించారు. ముందుగా సీసీఐ ఆధ్వర్యంలో 8 శాతం తేమతో క్వింటాకు రూ. 7,521 ధర నిర్ణయించారు.

అనంతరం ప్రైవేట్ వ్యాపారులు వేలంలో పాల్గొనగా సీసీఐ మద్దతు ధర కంటే తక్కువగా వేలం పాట ప్రారంభించారు. ప్రతి ఏడాదిలాగే వ్యాపారులంతా ఒకే ధర Rs.6,700 చెల్లిస్తామని ముందుగా ప్రకటించారు. దీంతో మార్కెట్ అధికారులు పదేపదే ధర పెంచాలని కోరినప్పటికీ వ్యాపారులు మాత్రం దిగిరాలేదు. అరగంట పాటు బతిమాలితే Rs.100, ఆ తర్వాత Rs.200 అంటూ చివరకు Rs.7,150 తో ముగించారు. దీంతో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి పత్తి కాంట దగ్గర పూజలు చేసి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించే క్రమంలో తేమ శాతం పరిశీలించడంతో దాదాపు ఒక వాహనంలో 20 శాతంపైగానే చూపించింది.

ఇటీవల వర్షాలు కురవడం, వాతావరణంలో మంచువల్ల పత్తిలో తేమ శాతం ఎక్కువగానే ఉంటుందని, అధికారులు మద్దతు ధర పెంచేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. కానీ వ్యాపారులు మాత్రం ఇందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పత్తి కొనుగోళ్లు ఆగిపోయాయి. దాంతో ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లు మద్దతు ధర, తేమ శాతంపై రైతులు రోడ్డెక్కడంతో మొదటి రోజు కొనుగోళ్లు జరుపకుండా ఆగిపోయింది.

కలెక్టర్ కాళ్లమీద పడి వేడుకున్న రైతు

జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వయంగా ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ అధికారులతో మాట్లాడినా ధర పెంచడంలో చొరవ చూపడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డులోనే జిల్లా కలెక్టర్ రైతులు, వ్యాపారులతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు.

ధర పెంచి తమకు న్యాయం చేయాల్సిందేనంటూ ఓ రైతు కలెక్టర్ కాళ్లమీద పడి వేడుకున్నారు. వ్యాపారులు ధర విషయంలో మొదటగా రూ. 7,150 నిర్ణయించగా, రైతుల ఆందోళనతో మరో రూ. 50 పెంచి రూ. 7,200లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉన్న తేమ శాతంతో ధరలో కోత విధిస్తారని, రూ. 7,200 సరిపోదంటూ రైతులు వాపోయారు. గుజరాత్ తరహాలో పత్తికి క్వింటాకు రూ. 8,800 చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో సాయంత్రం 4 గంటల తర్వాత మార్కెట్ యార్డు గేటును మూసివేసిన రైతులు అక్కడ కొద్దిసేపు ధర్నా చేపట్టారు. అనంతరం 5 గంటలకు పట్టణంలోని కిసాన్ చౌక్ లో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు.

అన్నదాతల వంటావార్పు

మద్దతు ధర పెంచడంతో పాటు తేమ ను పరిగణలోకి తీసుకోకుండా రాస్తారోకోతో పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న రైతులు ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్దతు తెలపడంతో జాతీయ రహదారిపైనే వంటావార్పు చేపట్టారు. అయితే ప్రస్తుతం ఈ ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పాయల శంకర్ (MLA Payala Shankar), జిల్లా కలెక్టర్ కలిసి మార్కెట్ యార్డులో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Next Story