సెగ్మెంట్ల వారీగా KCR ఆరా.. ఓటమిపై BRS పోస్టుమార్టం!

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-06 03:46:44.0  )
సెగ్మెంట్ల వారీగా KCR ఆరా.. ఓటమిపై BRS పోస్టుమార్టం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పోస్టుమార్టం నిర్వహించింది. ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో బుధవారం పార్టీ నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దీనికి కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరైనట్లు సమాచారం. 14 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కావడంపై గల కారణాలను ఆరా తీశారు. మెదక్ స్థానం గెలుస్తుందని ఆశించినా ఫలితాలు నిరాశపర్చడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో ముమ్మర ప్రచారం చేసినా.. 6 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని నీరు, ధాన్యం కొనుగోళ్ల అంశంలో నిరసన చేపట్టినా ప్రజలు ఎందుకు గులాబీ పార్టీని విశ్వసించలేదని కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ బస్సు యాత్ర, కార్నర్ మీటింగ్స్ సైతం సక్సెస్ అయ్యాయి. కానీ, అవి ఓటు రూపంలో ఎందుకు మళ్లలేదు. తప్పిదం ఎక్కడ జరిగింది. 7 పార్లమెంట్ స్థానాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో పార్టీ ఉనికిని ఎందుకు చాటలేకపోయాం. డిపాజిట్లు కోల్పోవడానికి కారణం ఏమిటి? అన్ని సెగ్మెంట్లలో పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజీ, పార్టీకి వచ్చిన ఓట్లు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లను నియోజకవర్గాల వారీగా బేరీజు వేస్తూ కేసీఆర్ నేతలకు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో 41 శాతం నుంచి 16 శాతానికి పార్టీకి ఓట్లు తగ్గడంపైనా నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది. కేడర్, నేతల మధ్య సమన్వయ లోపమా? అని అడినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో కేడర్‌లో నైరాశ్యం పెరిగిందని వారిలో భరోసా కల్పించాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. త్వరలోనే పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని, నేతలంతా ప్రజల వద్దకు వెళ్లాలని, పలువురు నేతలు తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలిసింది.

Also Read..

T-టీడీపీపై చంద్రబాబు ఫోకస్! స్టేట్ చీఫ్ బాధ్యతలు వారికే?

Advertisement

Next Story

Most Viewed