- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ కొత్త ప్లాన్.. నేషనల్ పార్టీలను ఇరుకున పెట్టడమే టార్గెట్
దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయపార్టీల వైఫల్యాలే లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. కాంగ్రెస్‌ను ప్రశ్నించడం.. బీజేపీని నిలదీయాలని భావిస్తున్నది. ఆ పార్టీలు ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నాయి.. ఏయే అంశాలను వివరించాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. జాతీయ పార్టీల వైఫల్యాలపై ఇప్పటికే గులాబీ సోషల్ మీడియా తీవ్రంగా ఎండగడుతూ ముమ్మర ప్రచారం చేస్తోంది. దానిని మరింత స్పీడ్ పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం.
నేషనల్ పార్టీలను ఇరుకున పెట్టేలా ప్లాన్
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలను ఇరుకున బెట్టేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతున్నది. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఎలా అన్యాయం చేస్తుంది.. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఏడాది కాలంగా చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించాలని భావిస్తున్నది. అందుకోసం వ్యూహాలను రచిస్తోంది. ‘కాంగ్రెస్‌ను ప్రశ్నిద్దాం.. బీజేపీని నిలదీద్దాం’ అనే నినాదంతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతోంది. కేడర్ అంతా పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు సన్నద్ధం చేయబోతోంది. అమృత్ స్కీమ్‌లో అవకతవకలపై ఇప్పటికే కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. బావమరిదికి సీఎం రేవంత్ అమృతం పంచుతూ ఆయన శోధా కన్‌స్ట్రక్షన్ అనే కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు కట్టబెట్టారని ఆరోపించారు. అర్హత, అడ్రస్ లేని కంపెనీకి రేవంత్ బావమరిది అనే కారణంతో అంత పెద్ద పనులు అప్పగించారని, ఈ కంపెనీకి అప్పగించిన పనులకు సంబంధించి ఎక్కడ వివరాలు లేవని పేర్కొన్నారు. ఏ మాత్రం అనుభవం, అర్హత లేని ఈ కంపెనీకి ముఖ్యమంత్రి బావమరిది అనే కారణంతో క్రోనీ క్యాపిటలిజానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
లగచర్ల, మూసీ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం
మరోవైపు లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ బాధితుల పక్షాన పోరాటం స్టార్ట్ చేసింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు ఢిల్లీకి తీసుకెళ్లి జాతీయ మానవహక్కుల, మహిళా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందుకు వెళ్లి బాధితులతో ఫిర్యాదు చేయించింది. వారిపక్షాన మరోవైపు న్యాయపరంగా ముందుకు వెళ్తున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే హైడ్రా, మూసీ బాధితుల పక్షాన న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం ప్రారంభించింది. రైతు, ప్రజా, నిరుద్యోగులు, విద్యార్థుల ఇలా అన్ని వర్గాల పక్షాన వారి సమస్యలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నది. వాటి పరిష్కారానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
బీజేపీని ఎండగట్టేలా గులాబీ కార్యాచరణ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరించాలని గులాబీ పార్టీ భావిస్తున్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రం నిధులు కేటాయించకపోవడం, ఆసుపత్రులకు నిధులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, కేంద్రీయ విద్యాలయాలు మంజూరు, ఇలా ప్రతి అంశాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నది. మరోవైపు రాష్ట్రంలో ప్రజాసమస్యలపై మాట్లాడకుండా, వారి పక్షాన ఉండకుండా కేవలం ప్రభుత్వానికి బాసటగా ఉంటున్నారనే అంశాలను ఉదాహారణతో వివరించాలని అందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అండగా ఉన్నారని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నది. రాష్ట్రంలో రేవంత్‌కు ఎప్పుడు కష్టం వచ్చినా కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు నిలబడతారని, రెప్పవాల్చకుండా.. రక్షణగా ఉంటూ కాపాడుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్ కేంద్ర సహాయమంత్రిగా కాకుండా రేవంత్‌రెడ్డి సహాయమంత్రిగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌ను తిడితే.. రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్ వంటి బీజేపీ ఎంపీలకు కోపం వస్తోందని ఆరోపించారు. ఈ నలుగురు బీజేపీ నేతలు రేవంత్‌కు రక్షణ కవచంగా ఉంటున్నారని విమర్శించారు. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలకు వివరణ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను మరింతగా ఎండగట్టేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలోనూ గ్యారంటీలు ఇచ్చి వైఫల్యం చెందిన తీరును ప్రజలకు వివరించనున్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో ఏయే అంశాల్లో వైఫల్యం చెందింది.. అన్ని వర్గాలను ఎలా మోసం చేసింది.. ఎవరెవరికి ఏమీ హామీలు ఇచ్చింది.. ఎలా వంచించింది.. ఇంకా ఎలాంటి మాటలు చెబుతుందనేది ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తున్నది. మరోవైపు మణిపూర్ అంశంపై స్పందించే రాహుల్‌గాంధీకి...లగచర్ల బాధితుల అంశం కనిపించటం లేదా? ఈ అంశంపై కచ్చితంగా ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ, ఖర్గే కూడా స్పందించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడాలని, రాజ్యసభలో కచ్చితంగా ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ పేదల తలరాత మారుస్తామంటూ పెద్ద పెద్ద నినాదాలు ఇస్తారని, కానీ అదానీ, రేవంత్, మీ పార్టీ తలరాత మార్చుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీలు, గిరిజనులు, దళితులు పోరాటం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
సోషల్ మీడియాలోనూ జాతీయ పార్టీల తీరుపై ప్రచారం
సోషల్ మీడియాలో రెండు జాతీయ పార్టీల తీరును ఎండగడుతూ విస్తృత ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే వైఫల్యాలపై దృష్టి సారించిన బీఆర్ఎస్ పార్టీ.. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలు.. గత పదేండ్లలో ఏం అన్యాయం చేసింది.. నిధుల విడుదల ఎంతా?.. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన బడ్జెట్ లెక్కలతో సహా సోషల్ మీడియా వేదికగా వివరించనున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్.. నిర్వహించిన ఎగ్జామ్స్ వివరాలు.. అన్ని ప్రభుత్వశాఖల వారీగా ఉద్యోగాల భర్తీ.. పారిశ్రామిక రంగంతో బీఆర్ఎస్ ప్రోత్సాహం.. ఉద్యోగాలు... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవలంభించిన విధానాలను పోల్చుతూ మీడియాలో ఇంకా మరింతగా విస్తృత ప్రచారం చేయాలని భావిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోపాలను ఎత్తిచూపేందుకు సిద్ధమవుతున్నది. ఏది ఏమైనా రెండు జాతీయపార్టీల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు సమాయత్తమవుతున్నది. ప్రజల పక్షాన కొట్లాడేది.. వారికి అండగా ఉండేది బీఆర్ఎస్ ఒక్కటే అని అంశాన్ని ప్రజలకు బలంగా వివరించాలని, వారి విశ్వాసాన్ని చూరగొనాలని పార్టీ భావిస్తున్నది.