- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ ఫోకస్
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో కుదేలైన పార్టీని నిలబెట్టుకోడానికి బీఆర్ఎస్‌లో కసరత్తు స్టార్ట్ అయింది. నాయకత్వ మార్పు కోసం కేడర్ నుంచి పరోక్షంగా ఒత్తిడి పెరుగుతుండడంతో ఈ నెలలోగానే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి పార్టీకి పొలిటికల్ వ్యూహం ఇచ్చేందుకు పొలిట్‌బ్యూరోను కూడా ఏర్పాటు చేసే దిశగా అధినేత ఆలోచిస్తున్నట్లు గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోయి నామమాత్రంగా మిగిలిన ఇప్పటికీ గ్రామ స్థాయి కమిటీలతో ఆ పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉన్నదని, ఇకపైన బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం కూడా అదే తరహాలో ఉండేలా కీలక నేతల మధ్య చర్చలు షురూ అయ్యాయి. పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే నిర్మాణం పకడ్బందీగా ఉండాలని పార్టీ సూచనప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది.
ఉనికిని కాపాడుకునేందుకు చర్యలు
దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా ఫలితం లేకపోవడాన్ని, ఇటీవల ఏపీలో వైఎస్సార్సీపీకి ఎదురైన ఓటమిని సీనియర్ నేతలు లోతుగా విశ్లేషించినట్లు బీఆర్ఎస్ నేతల సమాచారం. రానున్న రోజుల్లో పార్టీని నిలుపుకోలేకపోతే భవిష్యత్తులో ఉనికి ప్రశ్నార్థకమవుతుందని నేతల మధ్య జరుగుతున్న చర్చలు అధిష్టానం దృష్టికి వెళ్లడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడ కూడా చేదు అనుభవాలే ఎదురైతే కేడర్ చేజారిపోతుందని, మళ్లీ గ్రౌండ్ జీరో నుంచి వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే మేలుకోవాలనే దిశగా మీటింగులు నడుస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు చర్చించుకున్నారని, దానికి కొనసాగింపుగా కమిటీల ఏర్పాటుపై స్పష్టత వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.
గ్రామ స్థాయి నుంచే కమిటీలు
ఫస్ట్ టర్ములో పార్టీ నిర్మాణం ఆశాజనకంగానే ఉన్నప్పటికీ సెకండ్ టర్ములో ఎమ్మెల్యేలకే నియోజకవర్గ స్థాయిలో విస్తృత అధికారాలు ఇచ్చి పార్టీ ఇన్‌చార్జిలుగా నియమించడంతో వారికి అనుకూలంగా ఉన్నవారే మిగిలారని, మిగిలిన కేడర్ నిస్తేజంగా మారిపోయిందనే అంచనాకు వచ్చింది అగ్రనాయకత్వం. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను నిర్మిస్తే మాత్రమే పార్టీ మనుగడ సాధ్యమని, లేదంటే 60 లక్షల సభ్యత్వమున్నదని చెప్పుకున్నా ఫలితం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల్లో ఏకకాలంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ను తట్టుకుని నిలబడడం కత్తిమీద సాములా మారింది. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ స్థాయిలో బలమైన ఓటు బ్యాంకు ఉన్నదనే అంచనాకు వచ్చిన బీఆర్ఎస్ నాయకత్వం... పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అది బీజేపీకి షిప్ట్ అయిందని, భవిష్యత్తులో పెను ప్రమాదం ముంచుకొస్తున్నదనే ఆందోళనకు లోనవుతున్నది. ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్‌లను ఎదుర్కోవడంతో పాటు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో దాని ప్రభావం తెలంగాణలో సైతం ఉంటుందని, పార్టీని మళ్లీ యాక్టివ్ చేసే అవకాశాలున్నట్లు అనుమానిస్తున్నది.
ఒకేసారి మూడు పార్టీలతో ఢీ కొట్టాల్సిన పరిస్థితుల్లో కిందిస్థాయి లీడర్లకు ఏదో ఒక పార్టీ పదవి ఇవ్వకపోతే అది మొదటికే ఎసరు తెస్తుందని భావించి కమిటీల ఏర్పాటుతో వారికి బాధ్యతలు అప్పజెప్తే నిర్మాణం పటిష్టంగా ఉంటుందని లెక్కలు వేసుకున్నది. ఎమ్మెల్యేలే సుప్రీం అనే పాత విధానం స్థానంలో సంస్థాగతంగా పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన చేపట్టి లీడర్ల స్థాయికి తగిన బాధ్యతలు అప్పగించడంపై నిర్ణయం వెలువడనున్నది. అలా చేయడం ద్వారా మాత్రమే ఇప్పుడున్న లీడర్లను, కేడర్‌ను నిలబెట్టుకోవడంతో పాటు కొత్త శ్రేణుల్ని పార్టీలోకి చేర్చుకోవడం సాధ్యమవుతుందని, లేదంటే ఆత్మరక్షణలో పడి ఉనికి కోసం పాకులాడాల్సి వస్తుందన్న అభిప్రాయం లీడర్ల నుంచి వినిపిస్తున్నది