బీఆర్ఎస్ కొంపముంచిన ఎమ్మెల్సీ కవిత..?

by Satheesh |   ( Updated:2023-12-03 17:05:45.0  )
బీఆర్ఎస్ కొంపముంచిన ఎమ్మెల్సీ కవిత..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా బీఆర్ఎస్ పతనానికి అనేక కారణాలున్నాయి. అందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా కీలకం. రాష్ట్రంలో గులాబీ నేతలు అవినీతికి పాల్పడుతూ అక్రమంగా సంపదను పోగేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్న సమయంలో ఒక మహిళగా ఉండి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోవడం సామాన్య జనంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కూతురిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్‌తో అటు కేసీఆర్‌కు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చిపెట్టారని ఆ పార్టీ నేతల్లోనే మాటలు వినిపించాయి.

ఈ స్కామ్‌లో ఆమె ప్రమేయంపై వస్తున్న ఆరోపణల గురించి కేసీఆర్ ఒక్కసారి బహిరంగంగా కామెంట్లు చేయలేదు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ.. అది స్కామ్ కానే కాదు.. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించిన ఎక్సయిజ్ పాలసీ.. అంటూ వ్యాఖ్యానించారు. ఆ స్కామ్‌ను ఖండించలేక, కవితకు ప్రమేయం లేదనే ప్రకటన ఇవ్వలేక, ఆమె తీరును సమర్ధించుకోలేక బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు ఈ స్కామ్‌లో ఆమె ప్రమేయంపై సీబీఐ, ఈడీ సంస్థలు ఎంక్వయిరీ చేస్తున్న సమయంలో మహిళా బిల్లు అంశాన్ని తెరపైకి తేవడం డైవర్షన్ పాలిటిక్స్ అనే ముద్ర పడింది.

మూడుసార్లు ఈడీ విచారణకు హాజరైన కవితను అరెస్టు చేయడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్న సమయంలో కేటీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర అవసరాల కోసమంటూ కేంద్ర మంత్రుల్ని కలవడం అనుమానాలకు తావిచ్చింది. అర్ధరాత్రి అమిత్ షా తోనూ భేటీ అయ్యారనే వార్తలను గులాబీ నేతలు ఖండించినా కవిత కోసమే ఢిల్లీ రాయబారం నడిపారనేది జనంలోకి విస్తృతంగా వెళ్ళిపోయింది. కవిత అరెస్టు కాకుండా బీజేపీతో బీఆర్ఎస్ లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నదని, బీ-టీమ్‌గా మారిపోయిందనే వాదనలు బలంగా వినిపించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెపై వచ్చిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ఇరుకున పెట్టాయి.

Read More..

అహంకారమే ఓడించింది

ప్రజలతో కనెక్షన్ కట్.. అధికారం నుంచి ఔట్.. BRS ఓటమికి ఇదే ఒక కారణమే..?

Advertisement

Next Story