మంత్రి జూపల్లిపై ఈసీకి ఫిర్యాదు.. వైరల్ వీడియో ఆధారంగా బీఆర్ఎస్ ఫిర్యాదు

by Ramesh N |   ( Updated:2024-04-27 07:04:27.0  )
మంత్రి జూపల్లిపై ఈసీకి ఫిర్యాదు.. వైరల్ వీడియో ఆధారంగా బీఆర్ఎస్ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కు చెందిన ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎన్నికల సంఘానికి (ఈసీ) బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు డబ్బులు పంచినట్లు స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఒప్పుకున్నారని వెంటనే ఈసీ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాగా, మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ ఎన్నికల వేళ సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

కొల్లాపూర్‌లోని పెంట్లవెల్లిలో ఇటీవల కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘రేమద్దులలో (సర్పంచులు, ఎంపీటీసీలు) అందరూ వాళ్లే.. అక్కడ 900 మెజారిటీ వచ్చింది. చిన్నంబావిలో ఎంపీపీలు, జడ్పీటీసీలు వాళ్లే.. అధికారులు వాళ్లే.. పెత్తనం కూడా వాళ్లదే. అక్కడ కూడా సుమారు 300-400 మెజారిటీ వచ్చింది. పెంట్లవెల్లిలో ఏం తక్కువ చేసినం, మరి ఎందుకు ఓట్లు రాలే’ అంటూ కార్యకర్తలపై ఫైర్ అయ్యారు.

‘అన్ని చోట్ల కంటే ఎక్కువగా పెంట్లవెల్లిలోనే ఖర్చుపెట్టిన. ఇక్కడ పెట్టిన ఖర్చు ఎక్కడా పెట్టలేదు. ఎందుకు ఓట్లు రాలేదు?’ అంటూ కార్యకర్తలను ప్రశ్నించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టిందని ఆ మంత్రి మాటలతో స్పష్టమవుతుందని విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Advertisement

Next Story

Most Viewed