- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గులాబీ పార్టీ మరో యాక్షన్ ప్లాన్!

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు చేస్తున్న అన్యాయంపై క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం అందుబాటులో ఉన్న బీసీ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ షాంబిపూర్ రాజు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీకి చెందిన పలువురు సీనియర్ బీసీ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ప్రధానంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల మాదిరే బీసీలకు ఇచ్చిన హామీలను కూడా డొల్ల అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్న విషయంపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు హామీలు ఇచ్చి, మాట తప్పిన తీరుపై బీసీ వర్గాలను మరింత చైతన్యం చేయాలన్న దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమైంది.
తాజాగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ, కులగణన పేరుతో ప్రకటించిన గణాంకాల్లో బీసీ వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్న అభిప్రాయాన్ని నేతలు ఈ సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే బీసీ వర్గాల సంఖ్యను భారీగా తగ్గించిందని బీసీ నేతలు అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్న సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున బీసీ వర్గాలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాజకీయ అవకాశాలను, ఇచ్చిన పార్లమెంట్ అసెంబ్లీ సీట్లకు సంబంధించిన అవకాశాలను కూలంకషంగా చర్చించారు. బీసీలకు అండగా నిలబడేందుకు బీఆర్ఎస్ తరఫున తీసుకోబోయే కార్యాచరణపైనా విస్తృతంగా చర్చించే ఉద్దేశంతో ఆదివారం తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.