కంటోన్మెంట్‌పై ‘నో’ ఫోకస్.. అటువైపే చూడని KTR, హరీష్ రావు

by Disha Web Desk 4 |
కంటోన్మెంట్‌పై ‘నో’ ఫోకస్.. అటువైపే చూడని KTR, హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ గులాబీ పార్టీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్ సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉపఎన్నిక జరుగుతుండటంతో ఇక్కడ పార్టీ ఫోకస్ తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కంటోన్మెంట్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించారు. దీంతో ఆమె ప్రచార కార్యక్రమాన్ని సైతం చేపట్టింది. అయితే పార్టీ అధిష్టానం దృష్టంతా పార్లమెంట్ ఎన్నికలపై ఉండడంతో కంటోన్మెంట్ గెలుపు బాధ్యతను స్థానిక నేతలకే అప్పగించడంతో పాటు ఎన్నికల ఇన్చార్జీని సైతం నియమించింది. కానీ, ఆశించిన స్థాయిలో ప్రచారం జరగడం లేదని పార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

అటువైపు చూడని కేటీఆర్, హరీష్ రావు

కంటోన్మెంట్ అసెంబ్లీకి అభ్యర్థిని బీఆర్ఎస్ అధిష్టానం ఆలస్యంగా ప్రకటించింది. దీనికి తోడు ఎన్నికల ప్రచారం సైతం ఆలస్యమైంది. సాయన్న కుటుంబంపై సానుభూతి, సెంటిమెంట్ కలిసి వస్తుందని పార్టీ భావిస్తోంది. అయితే ఇప్పటి వరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సైతం కంటోన్మెంటు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నది లేదని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కేవలం మానిటరింగ్ చేసి ఆ తర్వాత ఫోకస్ అంతా లోక్ సభ ఎన్నికలపైనే పెట్టారని సమాచారం. దీంతో పార్టీ కేడర్ లో నైరాశ్యం నెలకొన్నది. ముగ్గురిలో ఎవరైనా ఒకరు ప్రచారం చేసినా నేతల్లో జోష్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సీనియర్ నేతలంతా ప్రచారానికి దూరం?

గత అసెంబ్లీ ఎన్నికల్లోనే టికెట్ రాకపోవడంతో నారాజుగా ఉన్న సీనియర్ నేతలు ఉప ఎన్నికలో అయినా టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డారు. అంతేగాకుండా కొంతమంది పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. వీరందరిని కోఆర్డినేషన్ చేసేవారు లేరని సమాచారం. దీంతో పార్టీ సీనియర్లు కొంతమంది అసెంబ్లీ సెగ్మెంట్ ను వీడి కేసీఆర్ చేపడుతున్న రోడ్ షోలకు వెళ్తున్నట్లు సమాచారం. మరికొంతమంది సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా, బీఆర్ఎస్ మాత్రం లైట్ గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జిపై గుర్రుగా...?

కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల్లో నియమించిన ఇన్చార్జీనే మళ్లీ నియమించింది. దీంతో ఆయన పార్టీ సీనియర్లను, కేడర్ ను కలుపుకొనిపోవడం లేదని, పార్టీలో ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన తీరుపై స్థానిక నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇన్చార్జీ వ్యవహార శైలితో కేడర్ సైతం నారాజ్ గా ఉందని పార్టీ అధిష్టానం దృష్టిసారించాలని సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోరారు. అయితే సమష్టిగా పని చేస్తేనే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవచ్చని, లేకుంటే నష్టం తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed