సచివాలయంలో అగ్నిప్రమాదం.. యాధృచ్ఛికమా?.. నిర్లక్ష్యమా?

by GSrikanth |   ( Updated:2023-02-03 23:30:15.0  )
సచివాలయంలో అగ్నిప్రమాదం.. యాధృచ్ఛికమా?.. నిర్లక్ష్యమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై అనేక అనుమానాలు తలెత్తాయి. యాధృచ్ఛికమా?.. లేక నిర్లక్ష్యమా?.. లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అంటూ చర్చలు జోరందుకున్నాయి. ఒక మంచి కార్యక్రమం తలపెట్టే సమయంలో అగ్నిప్రమాదం జరగడం శుభపరిణామమంటూ ఓ మంత్రి వ్యాఖ్యానించారు. అద్భుతమైన కట్టడాన్ని నిర్మిస్తుండడంతో ఇంతకాలం తగిలిన దిష్టి పోయిందంటూ మరో మంత్రి కామెంట్ చేశారు. చిన్న పైర్ యాక్సిడెంట్ మాత్రమేనని, ఇది మాక్ డ్రిల్‌లో భాగంగా జరిగిందని కొద్దిమంది అధికారులు చెప్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని మరో వాదన. ఈ నెల 17న గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరగనున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండడంతో ప్రారంభోత్సవం సైతం అంతే ఘనంగా నిర్వహించాలని భావించింది. తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులతో పాటు బిహార్ ఉప ముఖ్యమంత్రిని కేసీఆర్ ఆహ్వానించగా వారు కూడా సానుకూలంగానే స్పందించారు. ప్రారంభోత్సవానికి ముందు అగ్నిప్రమాదం జరగడంతో దీని ప్రభావంపైనా, ప్రారంభోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లకు కలిగే విఘాతంపైనా ముఖ్యమంత్రి ఇప్పటికే ఆరా తీశారు. ఒకటి రెండు రోజుల్లో స్వయంగా అక్కడకు వెళ్ళి పరిశీలించే అవకాశం ఉన్నట్లు అధికారుల సమాచారం. వివిధ రకాల పనులు ఏకకాలంలో మూడు షిప్టులవారీగా జరుగుతున్నాయి. రోడ్లు-భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం అధికారులతో రెగ్యులర్‌గా పనుల ముగింపుపై సమీక్షిస్తున్నారు.

ఇలాంటి సమయంలో అనూహ్యంగా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే అన్ని పార్టీల ప్రతినిధులను పరిశీలన కోసం అనుమతించాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరు పెట్టుకుని కేసీఆర్ పుట్టినరోజున ఓపెనింగ్ ముహూర్తాన్ని నిర్ణయించడం సమంజసం కాదని, దేవుడు కూడా అందుకు ఒప్పుకోలేదని, ఆ కారణంగానే ఫైర్ యాక్సిడెంట్‌తో ఆటంకాలు ఎదురయ్యాయని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ప్రారంభోత్సవం కాకముందే అగ్నిప్రమాదం జరిగితే ఆ భవనంలో రక్షణ ఎక్కడ అనే విమర్శలు మొదలయ్యాయి. సిబ్బంది మొత్తం అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఇలాంటిది జరిగితే పరిస్థితి ఏంటనే చర్చ కూడా స్టార్ట్ అయింది.

దిష్టి తొలగిపోయింది.. అగ్నిప్రమాదం జరగడం శుభ పరిణమామమే గదా.. అంటూ గులాబీ నేతల నుంచి కామెంట్లు రావడం సరికొత్త సందేహానికి తావిచ్చినట్లయింది. కేసీఆర్ యజ్ఞాలు చేసినప్పుడు పూర్ణాహుతి రోజున అగ్ని ప్రమాదం జరుగుతూ ఉండడం ఒక ట్రెండ్‌గానే మారింది. ఉప ఎన్నికల్లో విజయం లభించిన తర్వాత తెలంగాణ భవన్‌లో జరిగే సంబురాల సందర్భంగానూ స్వల్ప అగ్నిప్రమాదాలు జరగడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు సచివాలయం పనులు దాదాపుగా పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సమయంలో తెల్లవారుజామున ఊహకు అందని తీరులో స్వల్ప ప్రమాదం జరగడం చర్చకు తావిచ్చినట్లయింది. ఒకే పార్టీకి చెందిన నేతలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడంతో అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏంటనేది తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరు కావడానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో వాయిదా వేసే అవకాశాలు స్వల్పమేనని అధికారుల సమాచారం. ఎలాగూ ఓపెనింగ్‌కు ముందు ఒకటి రెండు సార్లు ముఖ్యమంత్రి విజిట్ చేయడం తప్పదని, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ కారణంగా తొందర్లోనే పరిశీలించే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. అగ్నిప్రమాదంతో పెద్దగా నష్టమేమీ లేకపోయినప్పటికీ దిద్దుబాటు చర్యలు తీసుకోడానికి పట్టే సమయం, ప్రారంభోత్సవానికి కలిగే ఆటంకం తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటివరకైతే ప్రారంభోత్సవం విషయంలో ఎలాంటి మార్పూ లేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story