ప్రజలపై రూ.24,594 కోట్ల విద్యుత్ భారం.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం

by karthikeya |
ప్రజలపై రూ.24,594 కోట్ల విద్యుత్ భారం.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ చార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ సీరియస్‌గా దృష్టి పెట్టింది. చార్జీలు పెంచే ఉద్దేశం లేదంటూ ఇటు ప్రభుత్వం, అటు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టంగా చెబుతున్నా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ‘గులాబీ’ పార్టీ పిలుపునిచ్చింది. పదేండ్లలో ఉత్తర, దక్షిణ డిస్కంలను అప్పుల్లో ముంచెత్తి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఆందోళన చేయడాన్ని అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు పార్టీ వర్గాలు తప్పుపడుతున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై పడిన భారాన్ని విద్యుత్ శాఖ వర్గాలు ప్రస్తావించాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్ల కాలంలో (2014-23 మధ్యకాలంలో) మూడు దఫాలుగా విద్యుత్ చార్జీలు పెంచినట్లు పేర్కొన్నాయి. దీంతో వినియోగదారులపై రూ.24,594 కోట్ల భారం పడినట్లు తేలింది. ఈ భారాన్ని అన్ని సెక్షన్ల ప్రజలూ భరించాల్సి వచ్చిందని, ఆ తప్పిదాలను దాచిపెట్టిన బీఆర్ఎస్.. ప్రస్తుత ప్రభుత్వంపై నిందలు వేయడం విద్యుత్ సిబ్బందిలోనే చర్చకు దారితీసింది.

రూ.18,845 కోట్లు వసూలు

2015–16 ఆర్థిక సంవత్సరంలో డొమెస్టిక్, నాన్-డొమెస్టిక్ సహా అన్ని కేటగిరీలకు కలిపి విద్యుత్ చార్జీల ద్వారా రెండు డిస్కంలు (ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్) రూ.18,845 కోట్లు వసూలు చేశాయని పాత లెక్కలను విద్యుత్ ఉద్యోగులు ఉదహరించారు. 2023–24లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి విద్యుత్ చార్జీల ద్వారా డిస్కంలకు రూ.43,439 కోట్లు రాబడిగా వచ్చినట్టు తేలింది. పదేండ్లలో అన్ని వర్గాలపై అప్పటి ప్రభుత్వం వడ్డించిన విద్యుత్తు చార్జీల భారం రూ.24,594 కోట్లుగా తేలిందని ఉద్యోగులు పేర్కొన్నారు. వాస్తవంగా 2020కి ముందు ఫిక్స్‌డ్ చార్జీల ప్రస్తావన లేదని, గృహ వినియోగదారుల నుంచి ఈ పేరుతో చార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని వారు గుర్తు చేశారు.

ఫిక్స్‌డ్ కస్టమర్ చార్జీల పేరుతో భారం

2015-16 ఆర్థిక సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5% విద్యుత్తు చార్జీలు పెంచింది. ఆ తర్వాత 2016-17లో 8%, 2022–23లో ఏకంగా 16% పెంచింది. ఒకే సారి ఇంత ఎక్కువ మొత్తంలో పెంచడంతో వినియోగదారులపై రూ. 6 వేల కోట్లకుపైగా భారం పడింది. ఓ వైపు చార్జీలు పెంచలేదని చెబుతూనే గుట్టుచప్పుడు కాకుండా పెంచడం, దీనికి తోడు ఉనికిలోనే లేని ఫిక్స్‌డ్ కస్టమర్ చార్జీల పేరుతో భారం వేసిన అంశాన్ని విద్యుత్ సిబ్బంది గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా సగటున ఒక్కో యూనిట్‌పై 50 పైసల నుంచి రూపాయి వరకు వసూలు చేసిందని గుర్తు చేశారు. ఫిక్స్‌డ్ కస్టమర్ చార్జీలు పెంచినప్పుడు వినియోగదారుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయని, దీనికి రకరకాల రీజన్స్ చెప్పి తాను తీసుకున్న నిర్ణయాన్ని గులాబీ పార్టీ సమర్ధించుకున్నదని ఉద్యోగులు వెల్లడించారు.

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం..

తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లోపాలు, చేసిన వైఫల్యాలను బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి ఇప్పుడు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.18 వేల కోట్ల భారం మోపుతున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. విద్యుత్ చార్జీలు పెంచాలని రెండు డిస్కంలు ఈఆర్‌సీకి సమర్పించిన ఏఆర్ఆర్‌లలో పేర్కొన్నాయి. పెంచే ప్రసక్తే లేదంటూ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చివరకు ఈఆర్‌సీ చైర్మన్ సైతం చార్జీలు పెరగబోవంటూ మీడియాకు వివరణ ఇచ్చారు. అప్పుల నుంచి బయట పడేందుకు సహకరించాలని ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈఆర్‌సీని కోరగా ప్రజలపై పడే రూ.1,200 కోట్ల భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించేందుకు సిద్ధపడింది.

Advertisement

Next Story

Most Viewed