మహారాష్ట్రపై బీఆర్ఎస్ ఫోకస్.. ఈసారి కనీవినీ ఎరుగని రేంజ్‌లో ప్లాన్!

by GSrikanth |
మహారాష్ట్రపై బీఆర్ఎస్ ఫోకస్.. ఈసారి కనీవినీ ఎరుగని రేంజ్‌లో ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. మరో సభ నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. రైతుసభపేరుతో, 12 లక్షల మందితో భారీగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నమోదయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే నాందేడ్, కాందార్ లోహా, ఔరంగబాద్ లో సభలు పెట్టి సక్సెస్ చేశారు. నాలుగో సభను సోలాపూర్, చంద్రపూర్ లేదా నాగ్ పూర్ లో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. కాగా, మహారాష్ట్రలో ల్యాండ్ కాకముందే రెండు అద్భుత విజయాలను సాధించామని అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులతో చెప్పినట్లు తెలిసింది. కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు తలాటీ (వీఆర్ఏ) వ్యవస్థపై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ప్రకటించిందని పేర్కొన్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేయవచ్చో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నేతలతో అన్నట్లు సమాచారం. ప్రజల నుంచి అనూహ్య ఆదరణ వస్తున్నదని, విజయం సాధిస్తామని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

నేతలకు హితబోధ...

బీఆర్ఎస్ విస్తరిస్తున్న క్రమంలో, ఇతర పార్టీల నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. మొదట్లోనే తీవ్ర విమర్శలు చేస్తే పార్టీకి ప్రజల నుంచి ఆదరణ రాదని నేతలతో గులాబీ అధినేత కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రావటానికి సిద్ధంగా ఉన్నారని, సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నారని ఈ తరుణంలో కాంట్రవర్సీ విమర్శలు చేయొద్దని హితబోధ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ ఇదే మన నినాదమని, బీఆర్ఎస్ సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని ప్రజలకు చేర్చి వారి ప్రేమను పొంది, ప్రజల మనసులు గెలవడం లక్ష్యమని పేర్కొనట్లు తెలిసింది. అందుకనుగుణంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎలక్షన్స్ లో పార్టీని విజయతీరాలకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పినట్లు సమాచారం.

రైతు సభ పేరుతో...

నాలుగో సభను రైతు సభ పేరుతో, 12లక్షల మందితో నిర్వహించి సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. మహారాష్ట్రలో ఇప్పటివరకు నిర్వహించని విధంగా సభ పెట్టాలని, ఆ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. సభను విజయవంతం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించాలన్నదే కేసీఆర్ తపన అని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదమే లక్ష్యమని మరోసారి సభలో చాటనున్నారు.

Advertisement

Next Story

Most Viewed