యూనియన్ బ్యాంకు‌లో బ్రోకర్ దందా.. అన్నింటిలో వారిదే హవా..!

by Sathputhe Rajesh |
యూనియన్ బ్యాంకు‌లో బ్రోకర్ దందా.. అన్నింటిలో వారిదే హవా..!
X

దిశ, నాగిరెడ్డిపేట్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో బ్రోకర్ దందా జోరుగా కొనసాగుతుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ తనకు నచ్చిన మధ్యవర్తి వ్యక్తులను ఏర్పాటు చేసుకొని బ్యాంకు లావాదేవీలలో మధ్యవర్తిత్వం చేయిస్తూ కమీషన్లు, ముడుపులు ఇచ్చిన వారికే హౌసింగ్ లోన్లు, బిజినెస్ లోన్లు, ముద్ర రుణాలు, ఇతర రుణాలను ఇస్తున్నారని, అంతేకాకుండా హౌసింగ్ లోన్లు, ఇతర లోన్లు తీసుకున్న వారు, కొత్తగా తీసుకునే వారితో సాయంత్రం వేళల్లో విందులు, వినోదాలలో గడుపుతున్నారని బ్యాంక్ ఖాతాదారులు పలువురు ఆరోపిస్తున్నారు.

బ్రోకర్ చెప్పిన వారే నియామకం

ఇటీవల యూనియన్ బ్యాంకుగా మారిన గత ఆంధ్ర బ్యాంకులో గత కొన్ని సంవత్సరాల పాటు మండల కేంద్రానికి చెందిన ఓ నిరుపేద వ్యక్తి బ్యాంకులో అటెండర్‌గా కొనసాగారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మేనేజర్ తాను బ్యాంకులో ఏర్పాటు చేసుకున్న బ్రోకర్ చెప్పిన మాటలతో ఇదివరకు పని చేసిన ఇద్దరు అటెండర్‌లను తొలగించి, వారి స్థానంలో బ్రోకర్‌కు సంబంధించిన వ్యక్తులను నియమించుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా బ్యాంకులో వ్యవసాయ రుణాల వసూళ్లు, వ్యవసాయ రుణాల మంజూరులో కూడా ఆ బ్రోకర్ చెప్పిన వారికే వ్యవసాయ రుణాలు ఇస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ రుణాల మంజూరులో ఎవరు ఎక్కువ ముడుపులు ఇస్తే వారికే రుణాలు ఇవ్వడమే కాకుండా, నకిలీ పట్టా పాస్ పుస్తకాలపై కూడా కొంతమందికి రుణాలు మంజూరు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బిజినెస్ కరస్పాండెంట్లతో బ్యాంకులో లావాదేవీలు

గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులకు సేవలందించేందుకు గాను బ్యాంకింగ్ రంగం యూనియన్ బ్యాంక్ పరిధిలో కొన్ని గ్రామాల్లో బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేయించి బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తుంది. అయితే ఈ బిజినెస్ కరస్పాండెంట్లు తమ తమ గ్రామాల్లోనే ఖాతాదారులకు తక్కువ మొత్తంలో డబ్బులు జమ చేసుకోవడం, చెల్లింపులు చేయడం, తదితర సేవలందించాల్సి ఉండగా, యూనియన్ బ్యాంక్ అధికారులు మాత్రం తమకు పని భారం తగ్గించుకునేందుకు బిజినెస్ కరస్పాండెంట్లను రోజుకు ఒకరు చొప్పున వంతుల వారి పద్ధతిలో వారితో బ్యాంకులో లావాదేవీలు చేయిస్తున్నారు.

దీంతో బిజినెస్ కరస్పాండెంట్లు పనిచేస్తున్న సంబంధిత గ్రామాలలో ఖాతాదారులకు బ్యాంక్ సేవలు అందక, ఐదు, పది కిలోమీటర్ల దూరం మండల కేంద్రానికి వచ్చి బ్యాంకులో లావాదేవీలు జరుపుకునే పరిస్థితులు దాపురించాయని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు తమ తీరు మార్చుకోకుంటే బ్యాంక్ ఖాతాదారులు త్వరలో బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లా జోనల్ బ్యాంకు అధికారులు స్పందించి యూనియన్ బ్యాంకులో అక్రమాలకు పాల్పడుతున్న బ్యాంక్ అధికారులపై చర్యలు చేపట్టాలని బ్యాంక్ ఖాతాదారులు కోరుతున్నారు..

Advertisement

Next Story

Most Viewed