ఊపిరి పీల్చుకున్న ఎమ్మెల్యేలు.. పరేడ్ గ్రౌండ్స్ సభ వాయిదాతో రిలీఫ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-11 07:58:31.0  )
ఊపిరి పీల్చుకున్న ఎమ్మెల్యేలు.. పరేడ్ గ్రౌండ్స్ సభ వాయిదాతో రిలీఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎలక్షన్ కోడ్ కారణంగా పరేడ్ గ్రౌండ్స్‌లో సభ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలకు ఉపశమనం కలిగింది. జన సమీకరణ బాధ తప్పిందని లోలోపల సంతోష పడుతున్నారు. జిల్లాల స్థాయిలో జన సమీకరణకు పెద్దగా ఇబ్బందులు లేకున్నా సిటీలో జరిగే సభలకు మాత్రం ఎమ్మెల్యేలకు ఒక సవాలే. గతంలో కొంగరకలాన్‌లో, గతేడాది ఆగస్టులో వజ్రోత్సవ స్వాతంత్ర వేడుకలకు ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరు కాలేదు.

ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభను ప్రారంభ సూచకంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావించింది. మాగ్జిమమ్ స్థాయిలో ప్రజలను తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నది. దానికి తగినట్లుగానే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎమ్మెల్యేలకు, హైదరాబాద్ నేతలకు మంత్రి కేటీఆర్ టాస్క్ అప్పగించారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కనీసంగా వెయ్యి మందిని తీసుకొచ్చేలా టార్గెట్ పెట్టారు.

అసెంబ్లీ సెషన్ అయిపోగానే అదే పని మీద ఉండేలా ఎమ్మెల్యేలు మానసికంగా సిద్ధమయ్యారు. ఎండాకాలం వస్తుండడంతో ఏ మేరకు సాధ్యమవుతుందనే అనుమానాలు లేకపోలేదు. దీనికి తోడు నగరంలో వారం రోజులుగా ట్రాఫిక్ సమస్యలు ప్రజలకు విసుగు పుట్టించాయి. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కారణంగా ట్యాంక్ బండ్ చుట్టూ వాహనాల రాకపోకలను ఇతర రోడ్ల మీదకు డైవర్ట్ చేయడంతో బషీర్‌బాగ్, హిమాయత్ నగర్, నిజాం కాలేజీ గ్రౌండ్స్, గాంధీ భవన్, లక్డీకాపూల్, మసాబ్ టాంక్, ఖైరతాబాద్, రాజ్‌భవన్ రోడ్డు.. ఇలా అనేక కీలక ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో కార్ రేసింగ్ జరిగే ట్రాక్ మీదకు దూసుకుపోవాల్సి వచ్చింది. ప్రజాగ్రహం నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్ సభకు ప్రజలను తరలించడం ఎమ్మెల్యేలకు ఛాలెంజ్‌గా మారింది. ఇలాంటి సమయంలో ఈసీ ఆర్డర్ వారికి ఊరటనిచ్చింది. ఈ నెల 17న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడుతున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో జరప తలపెట్టిన సభను కూడా బీఆర్ఎస్ వాయిదా వేసుకున్నది. కానీ అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

Next Story