BREAKING : CM రేవంత్ రెడ్డికి సమన్లు జారీ

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-29 14:11:27.0  )
BREAKING : CM రేవంత్ రెడ్డికి సమన్లు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోం మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పేరుతో నిర్వహిస్తున్న ట్విట్టర్ హ్యాండి­ల్‌లో ఈ నెల 27న చేసిన వీడియో పోస్టింగులో అమిత్ షా మాట­లను వక్రీకరించారన్న ఫిర్యాదు దాఖలు కావడంతో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం ఈ నోటీసులు జారీ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనే బాధ్యత వహించాలన్న ఉద్దే­శంతో ఈ నోటీసులు జారీ అయి­నట్లు సమాచారం. మే నెల 1వ తేదీన ఢిల్లీ పోలీసు శాఖలోని ఐఎఫ్ఎస్ఓ సైబర్ యూనిట్ ఎదుట తన మొబైల్ ఫోన్‌తో పాటు విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నట్లు తెలి­సింది. రేవంత్‌తో పాటు మరో ఐదుగురికి నోటీసులిచ్చిన స్పెష­ల్ టీమ్.. ఎడిటెడ్ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరికి షేర్ చేశారు.. తదితర వివరాలను వెల్లడించాలని ఆ నోటీసు­ల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు సమన్లు జారీచేసే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని ము­ఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

టీ బీజేపీ కంప్లైంట్

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటూ అమిత్ షా ఆ వీడియోలో ప్రసంగించినట్లు డీప్ ఫేక్‌తో తయారుచేశారని టీ బీజేపీ జనరల్ సెక్రెటరీ ప్రేమేందర్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్స్ విభాగం ఎఫ్ఐఆర్ (నెం.1014/2024) నమోదు చేసింది. ఐపీసీ 153, 153A, 465, 469, 171G, 66C ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ సైతం సీరియస్‌గానే స్పందించింది. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ పోలీసులు (స్పెషల్ సెల్) కేసును రిజిస్టర్ చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ప్రధాన నిందితులుగా చేర్చింది. సీఎం నివాసంలో ఇచ్చిన అనంతరం గాంధీభవన్‌కు వచ్చి నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మన్నే సతీష్‌కు 91 CRPC కింద నోటీసులు ఇచ్చారు. ఆయనతో పాటు పీసీసీ స్పోక్స్ పర్సన్ అస్మా తస్లీమాను కూడా మే 1న ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలని నోటీస్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు కూడా..

అమిత్ షా ఎడిటెడ్ (మార్ఫింగ్) వీడియోను ట్విట్టర్ (ఎక్స్), ఫేస్‌‌బుక్‌ మాధ్యమాల్లో తెలంగాణ పీసీసీ పోస్ట్ చేసినందున ఆ రెండు సంస్థల యాజమాన్యానికి కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు.

రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు : అమిత్ షా

ఎడిటెడ్ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ... పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నామని, నిజంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఎత్తివేయాలనే ఆలోచనే ఉంటే అది జరిగి ఉండేది కదా అని ఎదురు ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తాజాగా కర్ణాటకలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిందని. కానీ బీజేపీ మాత్రం ఈ సెక్షన్ల రిజర్వేషన్లను ఎత్తివేయాలనే ఆలోచన లేనే లేదని స్పష్టం చేశారు.

Read More...

రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఇలా చేయాల్సిందే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు




Advertisement

Next Story