BREAKING: ఎన్-కన్వెన్షన్ నేలమట్టం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-24 13:39:25.0  )
BREAKING: ఎన్-కన్వెన్షన్ నేలమట్టం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మదాపూర్‌లోని తుమ్మడి చెరువును ఆక్రమించి సినీ నటుడు అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్-కన్వెన్షన్‌ను శనివారం ఉదయం హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ నేలమట్టం చేశారు. ఈ క్రమంలోనే వెంటనే కూల్చివేతలు ఆపాలంటూ నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. అయితే, కూల్చివేతపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. చట్ట ప్రకారమే తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని పలు ఆక్రమణలు కూల్చివేశామని తెలిపారు. ఈ కూల్చివేతల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారని పేర్కొన్నారు.

తుమ్మడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్-కన్వెన్షన్ కూడా ఒకటి అని.. నిర్మాణాలు కూల్చివేయొద్దంటూ హైకోర్టు స్టే ఇచ్చిందని అనడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరం 12 గుంటల మేర స్థలంలో కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని అన్నారు. ఇక బఫర్ జోన్‌లోని 2 ఎకరాల 18 గుంటల్లో కన్వెన్షన్ నిర్మాణం విస్తరించి ఉందని స్పష్టం చేశారు. ఆ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేనట్లుగా గుర్తించామని అన్నారు. బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్-కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించినా సంబంధిత అధికారులు అందుకు అనుమతించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed