BREAKING: కులాల ఆధారంగా రిజర్వేషన్లు వద్దని చెప్పింది రాజీవ్ గాంధీనే: రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-05-03 05:34:19.0  )
BREAKING: కులాల ఆధారంగా రిజర్వేషన్లు వద్దని చెప్పింది రాజీవ్ గాంధీనే: రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని చెప్పింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీనే అని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆనాడు ప్రధాన హోదాలో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ కులాల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని ఆరోపించారు. ఆ లేఖలలో కులాల రిజర్వేషన్లతో దేశం సెకండ్ గ్రేడ్ సిటిజన్లు ఉన్న దేశంగా మారుతుందని చెప్పినట్లుగా వెల్లడించారు.

అలా చేస్తే.. వ్యక్తుల్లో ఉన్న టాలెంట్, మెరిట్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని అన్నది నెహ్రూనే అని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఆ రకంగా ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. మండల్ కమిషన్ రిపోర్టు అధారంగా విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్‌లో వీపీ సింగ్ ప్రశ్నిస్తే.. ఆయనను కాంగ్రెస్ అవహేళన చేసిందని ఫైర్ అయ్యారు. కులాల పేరు మీద రిజర్వేషన్లు అక్కర్లేదని.. పేదరికాన్ని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లను అమలు చేయాలంటూ రాజీవ్‌గాంధీ చెప్పారని ఆయన గుర్తు చేశారు.

అలా అడుగడునా.. రిజర్వేషన్లను అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీయేనని.. బీజేపీ కాదని ఆయన హితవు పలికారు. రిజర్వేషన్లు అమలు చేయాలని అప్పట్లో కాకా కలేల్కర్ మిషన్ నివేదిక ఇచ్చినా.. 17 ఏళ్లు ప్రధానిగా ఉన్న నెహ్రూ నివేదికను బుట్ట దాఖలు చేశారని ఆరోపించారు. నేడు ఎన్నికలు రాగానే బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ బీసీల రిజర్వేషన్లు తగ్గించి.. ముస్లీంలకు రిజర్వేషన్లు పెంచితే హైకోర్టు మొట్టికాయలు వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed