పార్టీ కేడర్‌కు బూస్టింగ్ టార్గెట్.. BRS ప్లీనరీపై కసరత్తు..!

by Rajesh |
పార్టీ కేడర్‌కు బూస్టింగ్ టార్గెట్.. BRS ప్లీనరీపై కసరత్తు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్లీనరీపై కసరత్తు కొనసాగుతోంది. ఎక్కడ నిర్వహిద్దాం? ఎప్పుడు నిర్వహిద్దాం? ఎన్నిరోజులు నిర్వహిద్దాం? ఎంతమందితో చేపడుదాం? అనే విషయాలపై కేసీఆర్ నేతలకు ఫోన్లు చేసి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం. వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కేడర్‌కు బూస్టింగ్ ఇచ్చేందుకు ప్లీనరీ నిర్వహణ తప్పనిసరి అని అధిష్టానం భావిస్తున్నది. త్వరలోనే ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత ప్లీనరీ తేదీ ఖరారు కానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

గతేడాది అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా పార్టీ ప్రతి ఏటా నిర్వహించే ప్లీనరీని రెండేళ్లుగా వాయిదా వేస్తూ వస్తోంది. అయితే, వరుస ఓటములతో పార్టీ కేడర్, లీడర్లలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పార్టీలో మనుగడ ఉంటుందా.. ఉండదా.. అనే డైలమాలో పడ్డారు. మేల్కోకపోతే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం ప్లీనరీని సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్లీనరీతో పార్టీ శ్రేణుల్లో మనోదైర్యం కల్పించాలని, పార్టీ మారకుండా కాపాడుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది.

అందులో భాగంగానే పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నేతలకు, మాజీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీ పరిస్థితులపైనా ఆరా తీసినట్లు తెలిసింది. అది ఒక్క జిల్లానే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ సీనియర్ నేతలకు ఫోన్ చేసి రాజకీయ పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ సభ్యత్వాల నమోదుపైనా పలు వివరాలు సేకరించినట్లు పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు.

హైదరాబాద్‌లోనా లేక వరంగల్‌లోనా?

కేసీఆర్‌కు వరంగల్ సెంటిమెంట్. అక్కడి నుంచి నిర్వహిస్తే ఏదైనా సక్సెస్ అవుతుందని భావన. అందుకే ఈసారి పార్టీ ప్లీనరీ అక్కడ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌లో నిర్వహిస్తే ఎలా ఉంటుంది. ఎప్పుడు నిర్వహిస్తే కేడర్ భారీగా తరలివస్తారనే వివరాలను తెలుసుకుంటున్నట్లు తెలిసింది. పార్టీ కార్యచరణను ప్రకటించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం కావాలని, హామీలు, గ్యారంటీల అమలులో జాప్యంపైనా ఎండగట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది.

త్వరలోనే పార్టీ ముఖ్యులతోనూ కేసీఆర్ భేటీ

ప్లీనరీ నిర్వహణపై ఫౌం హౌజ్ వేదికగా కసరత్తు జరుగుతుంది. త్వరలోనే పార్టీ ముఖ్య నేతలతోనూ కేసీఆర్ భేటీ అవుతారని, ఆ తర్వాతే తేదీ ఖరారు అవుతుందని పార్టీ వర్గాల సమావేశం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కార్యాచరణ ఇస్తేనే వారు యాక్టీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే పార్టీ కేడర్ చేజారే అవకాశాలు లేకపోలేదు. పార్టీ మాత్రం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

Advertisement

Next Story

Most Viewed