మండుతున్న ఎండలు… ఉగ్రరూపం దాల్చుతున్న భానుడు

by Naresh |
మండుతున్న ఎండలు…  ఉగ్రరూపం దాల్చుతున్న భానుడు
X

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భానుడు "ఉగ్రరూపం" దాల్చుతున్నాడు. ఉదయం 9: 00 దాటితే భానుడు భగభగ మనడంతో ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ దంచి కొడుతుంది. ఎండ వేడిమి తట్టుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మార్చిలోనే రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ మండలం మల్చల్మలో 38.7 అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. పాశమైలారం, బీహెచ్ఈఎల్, కిష్టారెడ్డిపేట్‌లో 38.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుండ్ల మాచనూర్, రాయికోడ్, పటాన్ చెరువు, సదాశివపేట, ముక్తాపూర్, సంగారెడ్డి, గుమ్మడిదల నిజాంపేట్, రామచంద్రపురం, 37 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది. మిగతా చోట్ల 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అందోల్ 34.8, మొగుడంపల్లిలో 34.7 ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అర్ధరాత్రి ఉక్కపోత ఎక్కువగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి : గాయత్రి దేవి జిల్లా వైద్యాధికారిణి, సంగారెడ్డి



ఎండాకాలం బయటకు వెళ్లేప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను వినియోగించాలి. 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లకూడదు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. చిన్నపిల్లలను, గర్భిణీ స్త్రీలను, వృద్ధులను ఎండలో బయటకు తీసుకెళ్లకూడదు. చాయ్ కాఫీ ఆల్కహాల్ చక్కెర అధికంగా ఉన్న ద్రవ పదార్థాలను తీసుకోవద్దు. అవి శరీరంలోని నీటిని ఎక్కువగా బయటకు పంపుతాయి. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

Advertisement

Next Story

Most Viewed