బీజేపీ షాకింగ్ డెసిషన్.. కీలక వ్యక్తికి మునుగోడు బాధ్యతలు!

by GSrikanth |   ( Updated:2022-09-30 10:28:38.0  )
బీజేపీ షాకింగ్ డెసిషన్.. కీలక వ్యక్తికి మునుగోడు బాధ్యతలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయంలో మునుగోడు వోల్టేజ్ రోజు రోజుకూ పెరుగుతున్నది. ఉప ఎన్నిక నవంబర్‌లో ఖాయమనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ జోరు పెంచుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాలను సుడిగాలి పర్యటనలతో చుట్టేస్తున్న బీజేపీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను నేరుగా పర్యవేక్షించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌కు పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆయన శనివారం హైదరాబాద్‌లో మునుగోడు నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ అయి మునుగోడులో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పోలింగ్ బూత్ కమిటీలపై చర్చించడంతో పాటు ఎన్నిక సన్నద్దతకు సంబంధించి నాయకులకు కీలక దిశానిర్దేశం చేస్తారని తెలుస్తున్నది.

నేరుగా హైకమాండ్ పర్యవేక్షణ:

దుబ్బాక, హుజూరాబాద్ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని బీజేపీ యోచిస్తున్నది. ఇందుకోసం స్వయంగా జాతీయ స్థాయి పెద్దలే వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇటీవల తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై నేతతో ఆరా తీశారు. తన వద్ద ఉన్న కీలకమైన సమాచారాన్ని నేతలతో పంచుకుని నేతల వద్ద ఉన్నసమాచారం సేకరించారు. ఈ సందర్భంలో పార్టీ నేతలకు ఆయన కీలక దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అధ్యక్షత ఓ స్టీరింగ్ కమిటీని సైతం పార్టీ ప్రకటించింది. 14 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్ ఇప్పటికే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భేటీ నిర్వహించి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ క్రమంలో తాజాగా అమిత్ షాకు సన్నిహితుడైన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌కు మునుగోడు బాధ్యతలు అప్పగించడంతో బీజేపీ మునుగోడు విషయంలో మరింత దూకుడు పెంచినట్లైందనే చర్చ మొదలైంది.

ఇప్పటికే పని షూరూ చేసిన బన్సల్:

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో యూపీ మోడల్‌ను అనుసరించడం ద్వారా టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలనేది బీజేపీ పెద్దల నిర్ణయంగా తోస్తున్నది. మొన్నటి వరకు యూపీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించిన సీనియర్ నేత అయిన సునీల్ బన్సల్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం వెనుక అసలు వ్యూహం ఇదే అనేది ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీంతో ఇప్పటికే యూపీలో పని చేసిన సర్వే బృందాలను బన్సల్ తెలంగాణలో మోహరించడంతో పాటు మునుగోడులోను క్షేత్రస్థాయిలో పని ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతున్నది. పార్టీ ఎక్కడ వీక్ ఉంది, ప్రభావితం చేయగల వ్యక్తులు నియోజకవర్గంలో ఎవరెవరూ ఉన్నారు పార్టీ ఓటు బ్యాంక్ పెంచుకునే మార్గాలపై బన్సల్ టీమ్‌లు పని ప్రారంభించినట్లు టాక్.

ఇవి కూడా చదవండి : పొత్తులపై బీజేపీ MP లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story