కేసీఆర్ వ్యాఖ్యలతో అసెంబ్లీ మలినం: బండి సంజయ్

by GSrikanth |   ( Updated:2023-02-12 17:15:51.0  )
కేసీఆర్ వ్యాఖ్యలతో అసెంబ్లీ మలినం: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన అబద్ధాలతో అసెంబ్లీ అంతా మలినమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్రమైన అసెంబ్లీలో అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. సభలో కేవలం మోడీని తిట్టే పనే పెట్టుకున్నారన్నారు. బడ్జెట్‌పై ఒక్క మాటా మాట్లాడలేదని మండిపడ్డారు. కేసీఆర్.. ప్రధానితో పోల్చుకున్నారని, సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడొచ్చా అని ఆయన విమర్శలు చేశారు.

ఆపాల్సిన స్పీకర్ కూడా ఏం చేస్తున్నాడని బండి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు, నేతలు కేసీఆర్‌ను ఒక కర్‌లా చూస్తున్నారన్నారు. కేసీఆర్ ఇప్పటికీ వందసార్లు రాజీనామా చేస్తానన్నారని, ఆయన మాటలన్నీ అబద్ధాలేనని ధ్వజమెత్తారు. వాటిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. కేసీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని, డేట్, టైం ఫిక్స్ చేసుకోవాలన్నారు. సీఎంగా ఆయన తప్పుకుంటే తెలంగాణకు పట్టిన శని పోతుందని ఘాటుగా స్పందించారు.

జిల్లాకో మెడికల్ కాలేజీ ఇస్తానన్ని హామీ ఏమైందని బండి ప్రశ్నించారు. ప్రపోజల్ ఎందుకు పంపించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఎందుకు అప్పులపాలైందో కేసీఆర్ జవాబివ్వాలని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎంకు ఇష్టమైన పాకిస్తాన్‌లో పెట్రోల్ కోసం కొట్టుకునే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిపై ఇప్పటికే అనేక కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని బండి తెలిపారు. జనగణనపై సెన్స్ లేకుండా కేసీఆర్ వ్యాఖ్యానించారని ధ్వజమెత్తారు. తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టావని, దీనికి సంబంధించిన ఆధారాలు బయటపెడుతానని సంజయ్ చెప్పారు.

కేసీఆర్ చేతకాని దద్దమ్మ అని విమర్శలు చేశారు. డిస్కంలకు చెల్లించాల్సిన నిధులు ఇవ్వకుండా నష్టాల్లో ఉంచావని, ఆ సంస్థలకే డబ్బులు చెల్లించలేని వ్యక్తి దేశాన్ని ఉద్ధరిస్తాడా అని విరుచుకుపడ్డారు. కేంద్రం.. సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనుకుటోందని కేసీఆర్ అంటున్నాడని, ఆ మాటకు కట్టుబడి ఆయన ప్రమాణం చేస్తాడా అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పేరుతో బిడ్డను లీడర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి డబ్బులతోనే బీఆర్ఎస్ కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వస్తుందో, లేదో సీఎం కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లి అడగాలని, ఆయన్ను తరిమికొట్టడం ఖాయమని బండి మండిపడ్డారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చింది సీఎంలా ఫొటోలు దిగేందుకు కాదని ఘాటుగా స్పందించారు. మోడీ ఉచితంగా బియ్యం ఇస్తే కేసీఆర్.. కిలోకి రూపాయి వసూలు చేశాడని మండిపడ్డారు. కేసీఆర్ ఫొటో ఎందుకు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా వలస వెళ్లిపోయాడని, అలా బీఆర్ఎస్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్లలా చేసుంటే కేసీఆర్ వెళ్లి తాగాలని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీకి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బండి డిమాండ్ చేశారు. మర్చిపోయి ఈటల పేరును పదే పదే ప్రస్తావించి ఉంటారని చురకలంటించారు.

Advertisement

Next Story

Most Viewed