80 వేల పుస్తకాలు చదివింది దీనికోసమేనా?.. సీఎంపై కిషన్ రెడ్డి ఫైర్

by GSrikanth |   ( Updated:2023-08-14 10:02:13.0  )
80 వేల పుస్తకాలు చదివింది దీనికోసమేనా?.. సీఎంపై కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కోకాపేటలో బీఆర్ఎస్ 11 ఎకరాలు తీసుకుందని బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీకి విలువైన స్థలాన్ని ఈ ప్రభుత్వం కేటాయించిందన్నారు. సోమవారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ సంపదను అంగట్లో అమ్మేస్తోందని దుయ్యబట్టారు. సంపదను సృష్టించాల్సిన ప్రభుత్వమే సంపదను కొల్లగొడుతోందని ధ్వజమెత్తారు. నిధుల కోసం ప్రభుత్వ భూములు అమ్మడం ప్రజా వ్యతిరేక చర్య అన్నారు. ఏ రాష్ట్రం చేయనంతగా రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ట్రైబల్ మ్యూజియం కోసం అర ఎకరం స్థలం మాత్రమే కేటాయించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను మాత్రం బడా వ్యాపారులకు ఆదరాబాదరగా భూములు కట్టబెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని తిరోగమనం దిశలో తీసుకువెళ్తున్నారని, 80 వేల పుస్తకాలు చదివింది భూములు అమ్మేందుకేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద సంపద లేకుంటే వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. భూములు అమ్ముకుంటూ వెళ్తే ప్రభుత్వ సంస్థలకు, పేదల ఇళ్లకు స్థలాలు ఎక్కడినుండి వస్తాయని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూముల అమ్మకంపై కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన వీడియోలను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్లే చేసి చూపించారు. అనుచరుల పేరుతో కేసీఆర్ కుటుంబం భూములు కూడగట్టుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న భూముల వేలాన్ని అడ్డుకుంటామన్నారు. కాగా, బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి పార్టీ ఆఫీస్‌కి వచ్చిన నటి జయసుధ, మాగాం రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, జైపాల్ రెడ్డిలను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి సన్మానించారు.

Advertisement

Next Story