Ponguleti Srinivas Reddy: బీజేపీ ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి: పొంగులేటి

by Prasad Jukanti |
Ponguleti Srinivas Reddy: బీజేపీ ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి: పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్స్ సంస్థల విషయంలో కేంద్రంలోని బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అదానీ గ్రూప్ లో సెబీ చైర్ పర్సన్ మాధబీ పూరీ బచ్ కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ఎదుట టీ కాంగ్రెస్ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆదేశాల మేరకు ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు దేశ ప్రజల మనోభావాలు వ్యక్త పరిచేలా ఆందోళన చేస్తున్నామన్నారు. బీజేపీ దొంగచాటుగా అదానీ గ్రూప్ ను కాపాడుతూ దేశ సంపదనంతా గౌతమ్ అదానీకి అంటగడుతున్నదని ధ్వజమెత్తారు. ఈ కేంద్రం అవలంభిస్తున్న ఈ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదన్నారు. సెబీ చైర్మన్ కుటుంబ సభ్యులకే అదానీ గ్రూప్ లో వాటాలు ఉన్నాయని అటువంటపప్పుడు విచారణాధికారిగా అదే సెబీ చైర్ పర్సన్ నే పెడితే ఈ కేసులో న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అందువల్ల రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా కోరినట్లుగా జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో జేపీసీ వేయడం ద్వారానే భారత ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.


Advertisement

Next Story

Most Viewed